- డిప్యూటీ సీఎం భట్టికి నివేదిక సమర్పించిన కమిటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : సంక్షేమ హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బృందం నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో గత 16 ఏళ్లుగా కాస్మోటిక్స్, 7 సంవత్సరాలుగా డైట్ చార్జీలు పెరగలేదు. దీంతో రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్, సంక్షేమ హాస్టళ్లలో 7.65 లక్షల మంది విద్యార్థులకు కాస్మోటిక్స్, డైట్ చార్జీలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి డైట్ , కాస్మోటిక్స్ చార్జీల పెంపుపై బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి తఫ్పీర్ ఇక్బాల్, ఇతర అధికారులు సీనియర్ శ్రీదేవి , అలుగు వర్షిణి, సైనికులు, సర్వేశ్వర రెడ్డిలతో కమిటీని నియమించారు.
ఈ కమిటీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న జవహార్ నవోదయ విద్యాలయాలు, గత ఏడు సంవత్సరాలుగా మార్కెట్‌లో నిత్యావసర ధరలు, ద్రవ్యోల్భణం వంటి అంశాలను అధ్యయనం చేసింది. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాస్మోటిక్స్ చార్జీలపై వేసిన సబ్ కమిటీ నివేదికను కూడా పరిశీలించింది. డైట్ కు సంబంధించి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పస్తుతం రూ.960 చార్జీలు ఉన్నాయి. దీనికి కనీసం రూ.1330 వరకు పెంచాలని కమిటీ సూచించింది. అలాగే 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం రూ.1100 చార్జీలు చెల్లిస్తున్నారు. దీన్ని రూ. 1540కు పెంచాలని సూచించారు. ఇంటర్ నుంచి పీజీ వరకు ప్రస్తుతం ఉన్న రూ.150 స్థానంలో రూ. 2,100కు పెంచాలని కమిటీ సూచించింది. కాస్మోటిక్స్ చార్జీలకు సంబంధించి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రస్తుతం రూ.55 ఉండగా, వాటిని రూ.175కు పెంచాలని సూచించింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.75 ఉండగా, వాటిని రూ.275కు పెంచాలని సూచించింది. కాస్మోటిక్స్ చార్జీలు 16 ఏళ్ల తర్వాత, డైట్ చార్జీలు ఏడేళ్ల తర్వాత పెంచాలనే ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని రెసిడెన్షియల్, సంక్షేమ హాస్టళ్లలో 7.65.705 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.