20 సంవత్సరాల క్రితం తనతో మొదలైన నెగటివ్ సెంటిమెంట్ ని తనే బ్రేక్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో సినిమా చేసిన హీరోకి.. నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వడమనేది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1'లో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'సుబ్బు' ఫ్లాప్ అయింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన రెండో సినిమా 'సింహాద్రి'లోనూ ఎన్టీఆరే హీరో. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'ఆంధ్రావాలా' డిజాస్టర్ అయింది. ఇలా ఎన్టీఆర్ తో ఈ నెగటివ్ సెంటిమెంట్ మొదలుకాగా.. రాజమౌళి సినిమాల్లో నటించిన ఇతర హీరోలు కూడా దానిని కంటిన్యూ చేస్తూ వచ్చారు.
రాజమౌళి డైరెక్షన్ లో 'సై' సినిమా చేసిన నితిన్ కి.. ఆ వెంటనే 'అల్లరి బుల్లోడు' రూపంలో ఫ్లాప్ ఎదురైంది. రాజమౌళితో 'ఛత్రపతి' వంటి విజయవంతమైన సినిమా చేసిన ప్రభాస్.. ఆ తర్వాత 'పౌర్ణమి'తో పరాజయం చూశాడు. 'విక్రమార్కుడు' తర్వాత రవితేజకు 'ఖతర్నాక్', 'యమదొంగ' తర్వాత ఎన్టీఆర్ కు 'కంత్రి', 'మగధీర' తర్వాత రామ్ చరణ్ కు 'ఆరెంజ్', 'మర్యాద రామన్న' తర్వాత సునీల్ కు 'అప్పల్రాజు', 'ఈగ' తర్వాత నాకు 'ఎటో వెళ్ళిపోయింది' '.. ఇలా అందరి హీరోలకు రాజమౌళి సినిమా తర్వాత పరాజయాలు ఎదురయ్యాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కి కూడా 'సాహో'తో నిరాశ ఎదురైంది.
ఇక రాజమౌళి గత చిత్రం 'ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా నటించారు. ఇప్పటికే రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'ఆచార్య'తో ప్రేక్షకులను పలకరించగా అది డిజాస్టర్ అయింది. దీంతో 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' (దేవర)ను కూడా ఈ సెంటిమెంట్ వెంటాడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టే విడుదలైన రోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినా ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన దేవర.. కేవలం ఆరు రోజుల్లోనే రూ.190 కోట్లకు పైగా షేర్ రాబట్టి హిట్ స్టేటస్ దక్కించుకుంది. దీంతో తమ హీరో సినిమాతో మొదలైన నెగటివ్ సెంటిమెంట్.. తమ హీరో సినిమాతోనే బ్రేక్ అయిందంటూ ఎన్టీఆర్ అభిమానులు సంబరపడుతున్నారు.
దేవర విజయం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. రాజమౌళికి, అలాగే నెక్స్ట్ ఆయనతో సినిమాలు చేయబోయే హీరోల అభిమానులకు కూడా సంతోషం కలుగుతుందని చెప్పవచ్చు.