- కూల్చివేతల ఖర్చును కూడా ఆ పార్టీ నుంచి వసూలు చేయడానికి హైకోర్టు ఆదేశం
ముద్ర, తెలంగాణ బ్యూరో :-హైకోర్టులో గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. నల్గొండ జిల్లాలో నిర్మించిన ఆ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చివేయాలని బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఖంగుతినాల్సివచ్చింది. పైగా పార్టీ కార్యాలయాన్ని కూల్చవద్దంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ సైతం కోర్టు కొట్టివేసింది. అనుమతులు లేకుండా కట్టడమే కాకుండా ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమని ఎలా ఒత్తిడి తెస్తారని బీఆర్ఎస్ పక్షాన వాదనలను వినిపించిన న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. వాటికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేయలేమని చెబుతూనే నల్గొండలోని ఆఫీస్‌ను పదిహేను రోజుల్లో నేల మట్టం చేయాలని స్పష్టం చేసింది.
జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఆఫీస్‌ను రెగ్యులరైజ్ చేసేలా అధికారులను ఆదేశించాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి తీసుకోకుండా ఆఫీస్ కట్టి… ఇప్పుడు రెగ్యులరైజ్ చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించారు. దానికి అయ్యే ఖర్చును నష్టపరిహారం రూపంలో లక్షరూపాయలను బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని తేల్చి చెప్పింది.బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూమిని అక్రమంగా అక్రమంగా ఆఫీస్ నిర్మించారని హైకోర్టులో గతంలో కాంగ్రెస్ నేతలు కేసు వేసిన విషయం తెలిసిందే. గులాబీ నేతలు పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కారు. అయితే వారికి హైకోర్టు షాక్ నిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కేవలం రూ.100లకు.. 99 ఏళ్లకు లీజ్
నల్గొండ టౌన్‌లోని హైదరాబాద్ రోడ్డు పక్కన భారీ విలువ పలికే ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు చెందిన భూమిలోని ఎకరా గుర్తింపు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి కేవలం రూ.100కే లీజ్ తీసుకుంది. ఆ తరువాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. అయితే ఈ భవనానికి సంబంధించిన శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని గతంలో నుంచి నేటి వరకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చిన ఆ భవనంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు.
కూల్చివేయాలని మంత్రి ఆదేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫోకస్ పెట్టారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుల మేరకు భవనాన్ని కూల్చివేయాలని అధికారులు గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా భవనాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం బీఆర్ఎస్ ఆఫీసు నిర్మించిన స్థలం విలువ రూ.2 కోట్ల పైమాటే అని ఆయన అన్నారు. స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆఫీసును కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో స్థానికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నడుమ యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్.. తాజాగా హైకోర్టు కూడా బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా తీర్పు వెలువరించింది.