హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల సందడి పెరిగింది. 70 అడుగుల ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర ఉదయాన్నే వైభవంగా కనిపిస్తుంది. సోమవారం ఒకరోజు ముందుగానే అన్ని చర్యలు తీసుకున్న ఉత్సవ సమితి నిర్వాహకులు, పోలీసులు నేడు తెల్లవారుజామునే శోభాయాత్ర కోసం. ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర భారీ మహా గణపతి శోభాయాత్ర సాగనుంది.
ఈ శోభాయాత్ర ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్‌దూత హోటల్, టెలిఫోన్ భవన్. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ మీదగా..ట్యాంక్ బండ్ వరకు చేరుకోనుంది. ఎన్టీఆర్ మార్గ్‌లో 4వ నెంబర్ దగ్గర మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా సూపర్ క్రేన్‌ని అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం 1 గంట లోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెల్లవారు జామునే శోభాయాత్ర ప్రారంభమైనప్పటికీ వందల సంఖ్యలో నగర ప్రజలు ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం శోభాయాత్ర సాగుతుండగా.. భక్తులు గణపయ్యతో కలిసి ముందుకు కదులుతున్నారు.