రాష్ట్రంలో వర్ష భీభత్సంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. అతిభారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తెలంగాణలో వరద పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు.
రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్న అమిత్ షాకు క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటు-న్నామని అమిత్ షాకు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
కేంద్రం నుంచి కావాల్సిన తక్షణ సాయంపై సీఎం ఆయనకు వివరించినట్లు సమాచారం. కాగా, అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందజేస్తామని తెలిపారు.
వర్షాల ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడి పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోనే ఉండగా, సెలవులను రద్దు చేశారు