- కాంగ్రెసే ఆ పార్టీని విలీనం చేసుకునేందుకు తహతహలాడుతోంది
- పథకం ప్రకారం ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు
- ఆప్ విలీనం అయితేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా..?
- రాజకీయ లబ్ది కోసం న్యాయస్ధానంపై బురద జల్లే ప్రయత్నం
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్,
ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్రంలో బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిందనీ…ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి ఏ మాత్రం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే బీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని తహతహలాడుతోంది, ఆ పథకం ప్రకారమే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నదని. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందనీ, అందులో భాగంగా శుక్రవారం కేసీఆర్ కు గవర్నర్ పదవీ, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, కవితకు బెయిల్ రాబోతుందని చేసిన వ్యాఖ్యలను ఖండించిన బండి.. గట్టి కౌంటర్ ఇచ్చారు.
కవితకు బెయిల్ ఇవ్వాలా..? వద్దా.. అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశమన్న సంజయ్..ఆమె బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా..? అని రేవంత్ రెడ్డికి ప్రశ్నించారు. సీఎం పదవిలో రాజకీయంగా కొనసాగుతూ లబ్ది కోసం న్యాయస్ధానంపై బురద జల్లి కోర్టుల ప్రతిష్టను కించపర్చొద్దని సూచించారు. బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు అధికార పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవుతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. కేసీఆర్ కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ కు పీసీ చీఫ్, హరీశ్ రావుకు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయమనిపిస్తోందన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడంతో పాటు మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ ది అన్న బండి.. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వంటి అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్ నేతలు జైలుకు వెళ్లకుండా కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లది దాగుడు మూతల వ్యవహారమన్నారు. సీఎంకు, ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా కాళేశ్వరం సహా పలు అంశాల్లో రూ.వేల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ ను జైలుకు పంపి.. కేసీఆర్ కుటుంబ సభ్యులకు జప్తు చేయాలని డిమాండ్ చేశారు.
విలీనం శుద్ధ అబద్ధం : ఎంపీ ఈటల రాజేందర్
బీజేపీ లో బీఆర్ఎస్ విలీనమవుతుందంటున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం మాటలు శుద్ధ అబద్ధమన్న ఆయన అలాంటి చర్చలో జరగనేలేదని స్పష్టం చేశారు.ఈ అంశంపై బీఆర్‌ఎస్ నేతలు అంతర్గతంగా చర్చించుకున్నారేమోనని అభిప్రాయపడ్డ ఈటల.. ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఈ విషయం గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని మమ అనిపించిందనీ, పూర్తి స్థాయిలో రుణమాఫీ ఈ ప్రభుత్వం చేయవలసి ఉంటుంది. సీఎం, సర్కార్ ప్రజల రైతులను మోసం చేశారు. హైడ్రా పేరుతో అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తే ఊరుకునే ప్రసక్తే. అడ్డగోలుగా కూగొట్టి అధికారం వారికి ఎవరు ఇచ్చారన్నారు.