- బాచుపల్లిలో 51 అక్రమ నిర్మాణాల తొలగింపు
ముద్ర, తెలంగాణ బ్యూరో : అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరింత దూకుడు పెంచింది. నానాటికి రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నా అవేమీ లెక్క చేయకుండా కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. తాజాగా గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతి నగర్ లోని ఎర్రకుంట చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది. హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రకారం అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు.
329,342 సర్వ నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇదిలావుంటే ఈ నెల 14న ఎర్రకుంట చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 24 గంటలు పూర్తి కాకముందే కూల్చివేతలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువుల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవనాలను కూల్చివేస్తామని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇదీలావుంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై హైదరాబాద నగర ప్రజలు సామాజిక మాధ్యమాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.