- హాస్టళ్ళలో ఆహారం, సౌకర్యాలపై ఆరా
- పలు హాస్టళ్ళలో మెస్, స్టూడెంట్స్ రిజిస్టర్లు స్వాధీనం
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ హాస్టళ్ళలో నాణ్యమైన భోజనం అందించడం లేదనే ఫిర్యాదులపై తనిఖీలు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హాస్టళ్ళలో ఆహారంతో పాటు సౌకర్యాలపై ఆరా తీశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు జరిగాయి. గురుకులాలు, హాస్టళ్లలో సోదాలు చేశారు. మెస్, స్టూడెంట్స్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులన్నింటిని అధికారులు పరిశీలించారు.
పలు హాస్టల్ స్టూడెంట్స్ రిజిస్టర్ లలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్టు వార్డెన్ లు నమోదు చేశారు. ఎక్కువ మంది ఉన్నట్టు చూపి అధిక మెస్ బిల్లులు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కొంతమంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందజేస్తున్న ప్రభుత్వ ప్రయోజనాలను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు జరిగాయి. పలు రికార్డులను పరిశీలించారు.