ముద్ర, ఢిల్లీ బ్యూరో: లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో వున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు ఇచ్చింది. జూన్ 1వ తేదీ వరకు అమలులో వుండే షరతులతో కూడి బెయిల్ అందించింది. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే, సీఎంగా బాధ్యతలు కోర్టు నో చెప్పింది. జూన్ 2వ తేదీన తప్పనిసరిగా సరెండర్ కావాలని కోరింది. లోక్ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ అందించాల్సిందిగా ఆప్ అధినేత ఆయన లాయర్లు గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) మార్చి 21న అరెస్టు చేసిన విషయం విధితమే. కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్నారని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రలోభానికి గురిచేస్తారని ఈడీ వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం చివరికి కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది.