- అప్పు…తప్పు అన్నోళ్ళని….ఇప్పుడు దేనితో కొట్టాలి
- ఎక్స్ వేదికగా ప్రశ్నించిన కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన పది నెలల కాలంలోనే రూ. 80,500 కోట్ల అప్పు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరి నాడు అప్పు తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? అని చురకలు అంటించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఇంత అప్పు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.అప్పుల్లో ఇదే తొలిసారి రికార్డ్ అని ఆయన పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి సాగునీటి ప్రాజెక్టు కట్ట. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు ? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు ? అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారదత్తం చేస్తున్నారా ? లేక కమీషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ? అని నిలదీశారు. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్….ఇప్పుడు అవే అప్పుల కోసం పాకులాడటమేంటి ? అని ఎక్స్ వేదికగా అడిగారు
మేము కష్టాలు తీర్చాము…
బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టామన్నారు. ప్రతి పైసాతో మౌలిక సదుపాయాలు పెంచామన్నారు. తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చమన్నారు. కానీ.. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల “అడ్రస్” ఎక్కడ? అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా.. రైతుభరోసా వేయకుండా.., ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా.. నెలలపాటు జీతాలు ఇవ్వకుండా.. ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు ? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? అని నిలదీశారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని అన్నారు.