హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏటా తరహాలోనే ఈసారి కూడా హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలని మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మంగళవారం (సెప్టెంబర్ 10) విచారణ జరిగింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పిటిషన్ విచారణ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు చేయకూడదని, నీరంతా కలుషితం అవుతోందని పిటిషనర్ వాదనలు వినిపించారు. నిమజ్జనాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈసారి కొనసాగించాలని కోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం కీలకంగా ఉన్న 'హైడ్రా'ను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలని విన్నవించారు. అయితే, పూర్తి వాదనలు విన్న తర్వాత ధర్మాసనం 'హైడ్రా'ను ప్రతివాదిగా చేర్చడానికి ఒప్పుకోలేదు. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషనర్ సరికాదని కోర్టు తప్పుబట్టింది. అలాగే ఆ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అయింది.