ముద్రణ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకుంటున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి టీఎన్జీవో కేంద్ర సంఘం (ఎస్ఐఎస్ జీఈఎఫ్) కృతజ్ఞతలు ప్రదర్శించారు. ఈ మేరకు బుధవారం అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.
జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి శ్రీకుమారన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాల్లో 24 రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకాగా తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ , ఉపాధ్యక్షులు, ఎస్ ఎం హుసేన్ (ముజీబ్), ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యచరణకు మార్గాలను నిర్దేశించారు.
అనంతరం టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దు, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడం, నూతన వేతన సవరణ, ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం వంటి అనేక సమస్యలపై ప్రభుత్వం చర్చించి పరిష్కరిస్తామన్నారు.