ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన.. అంటూ సిరివెన్నెల సినిమాలో వచ్చే ఈ పాట ఎంత హిట్టో అందరికి తెలిసిందే. సినిమా పాటల్లో తెలుగు సాహిత్యాన్ని అద్భుతంగా, అలవోకగా, అనర్గళంగా రాయగల కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.
నా ఉచ్ఛవాసం కవనం నా నమ్మకం గానం.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. ఎప్పుడు ఒప్పుకోకు ఓటమిని.. తెల్లారింది లెగండోయ్.. అప్పుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం.. యగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఎదిగాం అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన కొన్ని పాటలు సమాజానికి కనువిందు చేస్తాయి. ఇలా ఎన్నో పాటలని తెలుగు సినిమా పాటలకి అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. అలాంటి సిరివెన్నెల సాహిత్యం గురించి కాసేపు మాట్లాడుకునే అవకాశం ఈటీవీ ఛానల్ 'నా ఉచ్ఛ్వాసం కవనం' అనే ప్రోగ్రామ్ ద్వారా అందరికీ తెలుసు. తాజాగా ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా సిరివెన్నెల తన సినిమాలకి రాసిన పాటలు, సాహిత్యం గురించి ప్రభాస్ మాట్లాడాడు.
సిరివెన్నెల గారితో మీ మొదటి పరిచయం గురించి చెప్పండని అడుగగా.. ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు ప్రభాస్. ఎమ్మెస్ రాజుగారు వచ్చి శాస్త్రి గారు వచ్చారు.. వెళ్లు కలువమంటే వెళ్లాను.. అప్పుడు వర్షం సినిమాకి గాను మెల్లగా కరగని అంటూ మెలోడి సాంగ్ పాడి వినిపించారు.. అప్పుడు నాకు గుండె ఆగిపోయింది.. తర్వాత ఆ పాటలోనే ఈ వర్షం సాక్షిగా పాడారు.. నాకేమో వర్షం ఎందుకు.. ఐ లవ్యూ శైలజ ఇంకా బావుంటుందేమో కదా అని మనసులో అనుకున్నా.. అంటే అప్పటికి మనకి ఏం అర్థం కాలేదంటూ ప్రభాస్ అన్నాడు. ఇక లంగావోణి నేటితో రద్దయిపోని పాట లిరిక్స్ గురించి మాట్లాడుతుండగా ప్రభాస్ ఆ లిరిక్స్‌ను అల్లుకుంటూ వెళ్లిపోయారు. అసలు రొమాన్స్‌ను కూడా అంత అందంగా రాయొచ్చని శాస్త్రిగారిని చూశాకే అర్థమైందంటూ ప్రభాస్ అన్నాడు. ఇక చరణాల్లో సాహిత్యం కూడా ఇంతలా మీకు ఎలా గుర్తుందని అడుగగా.. ఆ లిరిక్స్.. దాని అందం, దాని అర్థం.. రాసేవాళ్ల విలువ ఏంటి అనేది అర్థమైందో ఆయన వల్ల.. అందుకే నేను అందరికి పిలిచి చూడు శాస్త్రిగారు ఎలా రాశారో ఈ పాటలో విసిగించేవాడిని అంటూ ప్రభాస్ చెప్పాడు.