- ఏడు రోజుల్లో 37 గంటలు 44 నిమిషాలు సాగిన సభ
- 8 బిల్లులకు ఆమోద ముద్ర
- చివరి రోజూ అధికార, ప్రతిపక్షాల మధ్య వార్డ్
- శాసనమండలిలో గళమెత్తిన ప్రతిపక్ష ఎమ్మెల్సీలు.. కౌంటర్ ఇచ్చిన అధికార పక్షం
- మున్సిపల్, జీహెచ్. పంచాయతీరాజ్ బిల్లులకు ఆమోదం
- రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ
- పంట పెట్టుబడి సాయంపై అధికార పక్ష సభ్యుల క్లారిటీ
- మహాలక్ష్మీ నగదు.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కార ప్రతిపాదన తిరస్కరణ
- రుణమాఫి వంద శాతం అయినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : కేటీఆర్
- గత ప్రభుత్వ విధానాలతోనే ఆరు గ్యారంటీల అమలులో జాప్యం : సీఎం రేవంత్
- రైతు ఆత్మహత్యల అంశంలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ
- ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవన్న రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శలు వాదోపవాదాలతో రాష్ట్ర శాసనసభ నిరవధిక వాయిదా పడింది. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు శనివారం వరకు కొనసాగుతాయి. మొత్తంగా 7 రోజులు శాసనసభ సమావేశాలు కొనసాగాయి, ఈ సెషన్‌లో 37 గంటల 44 నిమిషాల పాటు సభ మొత్తం సాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఈ సెషన్‌లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం లభించింది. చివరి రోజు రైతుభరోసాపై స్వల్ప వ్యవధి చర్చ ముగిసిన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఇచ్చిన రాష్ట్ర ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. కాగా సమావేశాల చివరి రోజు అసెంబ్లీలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చ కోలాహలంగా మారింది.
అధికార, ప్రతిపక్ష సభ్యులు రైతు రుణమాఫీపై మాట్లాడుతూ.. ఒకరికి మరొకరు సవాళ్లువిసురుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రుణమాఫీ ఆరు వేల కోట్ల కన్నా ఎక్కువ జరగలేదని, ప్రకటించని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరామరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో నాలుగు విడతల్లో రుణమాఫీ రైతులకు వడ్డీకి కూడా సరిపోలేదని చెప్పారు. 2014లో ఇవ్వలేదని, మళ్లీ 2018 ఎన్నికల్లో 2019లోనే హామీ ఇచ్చి విడతల్లో చివరి వరకు అది బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. అలాగే ఒకే వేల కోట్ల ఏడాదిలో రూ.21 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పారు. కేటీఆర్ పదే పదే అక్కడికి రా.. ఇక్కడికి రా అని మాట్లాడుతున్నాడని, కేటీఆర్ కు దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు ఉంటే నా నియోజకవర్గానికి రావాలని నా నియోజకవర్గంలో 70% మంది రైతులకు రుణమాఫీ కాకపోతే నేను రాజీనామా చేస్తా.. రుణమాఫీ జరిగితే కేటీఆర్ రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు. అంతేగాక బీఆర్ఎస్ నాయకులు ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీనామా చేసి.. రాజకీయ సన్యాసం తీసుకుంటా : కేటీఆర్
రాష్ట్రంలో రైతు రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకున్నానని మాజీ మంత్రి కేటీఆర్ ప్రజా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. కొండారెడ్డి పల్లి, పాలేరు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దామని సవాల్ చేశారు. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చా సందర్భంలో కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రుణమాఫీపై రైతులను అడుగుదామని, వంద శాతం రుణమాఫీ అయినట్లు నిరూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుబంధుపై సమగ్ర చర్చ జరగాలని, రైతు భరోసాను ప్రారంభించింది తామేనని స్పష్టం చేశారు. రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని, రైతుబంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు.
రైతుబంధు ఒక పంటకు ఇస్తారో లేక.. రెండు పంటలకు ఇస్తారో ప్రభుత్వం వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాని కోసం సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ రైతులను జైల్లో పెట్టారని, కేవలం అనుముల కుటుంబం కోసం, బామ్మర్ది కోసం, అన్నదమ్ముల కోసం పని చేయకండి అని హితవు పలికారు. అన్నదాతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలని, రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందని.. 60 శాతం అయ్యిందని మరొకరు చెప్పారు. రైతు రుణమాఫీ ఎంత మేర జరిగిందో స్పష్టంగా చెప్పాలన్నారు. 25 శతమా, 50 శాతమా మంత్రులకే స్పష్టత లేదు. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం పెడుతా అన్నారని, ఏకకాలంలో ఒకటే పెన్ స్ట్రోక్‌తో రుణమాఫీ చేస్తానని ప్రకటించారని, డిసెంబరు 7న స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్‌లో రుణమాఫీ కోసం రూ. 49 వేల 500 కోట్లు అని చెప్పారని వివరించారు. కానీ, రుణమాఫీ లెక్కలు కేబినెట్‌కు వచ్చే వఱకు రూ. 31 వేల కోట్లు, బడ్జెట్‌కు వచ్చేసరికి రూ. 26 వేల కోట్లు అయిందని, పాలమూరు విజయోత్సవ సభలో రూ. 19 వేల కోట్లు అని సీఎం చెప్పారు.
ఆలస్యంపై హరీష్‌రావు ఫైర్
శాసనసభ పది నిమిషాల ఆలస్యంగా ప్రారంభం కావటంపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 10గంటలకు ప్రారంభంకావాల్సిన సభ.. 10.10గంకు ఎందుకు ప్రారంభం అయిందని, సభను సమయానికి ఎందుకు నడపడం లేదని హరీష్‌రావు నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు సభను సమయానికి నడిపామని గుర్తుచేశారు. చట్టాలు చేసే మనం ఆదర్శంగా ఉండాలని, సభను సమయానికి ప్రారంభించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
కోమటిరెడ్డి వర్సెస్ హరీశ్‌రావు
అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య వర్డ్ వార్ కొనసాగింది. సభలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ దే అని గత ప్రభుత్వం కేవలం 14గంటల విద్యుత్ మాత్రమే ఇచ్చింది. ఒక సబ్ స్టేషన్‌లో లాగ్ బుక్‌ని చూస్తే ఈ విషయం తెలిసిపోయింది. ఆ 14 గంటలలోనూ ఐదారు సార్లు కోతలుండేవారు. బీఆర్ఎస్ పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు నిర్మించారన్న కోమటిరెడ్డి.. మిషన్ భగీరథ పేరుతో రూ. 50వేల కోట్లు కాజేశారని. మంత్రి వ్యాఖ్యలను ఖండించిన హరీశ్ రావు మిషన్ భగీరథ ఖర్చు రూ.28వేల కోట్లు అయిందని, అందులో రూ.50వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని హరీశ్ రావు ప్రశ్నించారు. మంత్రి మతిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నల్గొండకు ఏం చేయలేదు అనడం సరికాదని హరీష్‌రావు పేర్కొన్నారు. దీంతో హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేళ్లలో తామే అంతా చేశామని చెప్పడంపై మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు. నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టుకు ఒక్క ఎకరాకు నిధులు ఇచ్చినట్టు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. పదేపదే హిస్టరీ గురించి చెప్పడంపై కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. చివరకు స్పీకర్ జోక్యంతో చర్చ మళ్లీ మొదలైంది. ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో పిలవడం సరికాదని కేటీఆర్‌కు సూచన స్పీకర్ చేశారు. తానేమీ తిట్టలేదంటూ మళ్లీ కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత చర్చ మొదలైంది. ఇక, పదేళ్లలో నీళ్లు, నిధులు ఎక్కడంటూ మంత్రి కోమటిరెడ్డి ఎదురుదాడికి దిగారు. రేపో మాపో మేడిగడ్డ కూలిపోతుందని రిపోర్టు ఇచ్చారని, పదేళ్లలో మీరు ఏం చేశారని పేర్కొన్నారు. సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఈలోగా కేటీఆర్ మాట్లాడుతూ సభను 10 రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు.
రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ది : మంత్రి సీతక్క
రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అద్దె ఇంట్లో ఉన్నోడు ఓనర్ ఎలా అవుతాడు..? కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వారిపై ప్రేమ ఒలకబోస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది రైతు బంధు కాదు. పట్టా బంధు ఇచ్చారు. పట్టా ఉన్నవాళ్లకే రైతుబంధు వచ్చింది. కౌలు రైతులకు, పట్టా లేని చిన్నా, సన్నకారు రైతులకు రాలేదు. గత ప్రభుత్వం చేసింది రుణమాఫీ కాదు. అది కేవలం వడ్డీమాఫీ. ఆ రోజు రుణమాఫీ పేరుతో పెట్టిన నిబంధనలతో నేడు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీకి కొందరు కాంగ్రెస్ అర్హులు కాలేదు అన్నది వాస్తవం. బీఆర్ఎస్ హయాంలో రైతులకు అన్నీ చేశామని చెబుతున్నారు. మరి రూ. 30 వేల కోట్ల రుణమాఫీ ఎందుకు మిగిలి ఉందో కేటీఆర్ చెప్పాలి. మా ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఫ్రీబస్ పెట్టింది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చింది. రూ. 500కే గ్యాస్ ఇచ్చింది. రైతుభరోసా కింద రూ. 12 వేల ఇవ్వబోతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో భూమి లేని నిరుపేదలకు ఏం ఇచ్చారో చెప్పాలి.
రైతులందరికీ 'భరోసా' : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రైతు భరోసా పథకంలో ఏ ఒక్క రైతును తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద రైతులకు కూడా రైతుబంధు ఇస్తున్నారంటూ దుష్ప్రచారం చేశారు.కానీ ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందరి సూచనల తర్వాతే విధివిధానాలను ఖరారు చేస్తాం.
51 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం : మంత్రి పొన్నం
టర్రింగ్ రోడ్డు పరిథిలోని 51 పంచాయితీలను మున్సిపాలిటీల్లో విలీన ప్రక్రియకు ఆమోదం తెలిపాం. హైదరాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ లక్షణాలు ఉన్న 51 గ్రామ పంచాయతీలను పట్టణ ప్రాంతాలకు దగ్గరగా లేదా పట్టణ గ్రామాలకు సమీపంలో ఉన్న మున్సిపాలిటీ మున్సిపల్ కార్పోరేషన్‌లో విలీనం చేస్తాం. అలాగే రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు 80 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు గా ,మున్సిపల్ కార్పొరేషన్లుగా మారుతున్నాయి. కోర్టు ప్రకారం పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించేందుకు డికేటెడ్ కమిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ట్రిబ్యునల్ సవరణ మేరకు పంచాయతీ రాజ్ చట్టం షెడ్యూల్ 8 లోని 140 పంచాయతీల సవరణ చేశాం.
రైతులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కమట ప్రేమ : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
2014 ముందు రైతులే లేనట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాట్లాడుతున్నాయి. మేమే వ్యవసాయాన్ని సృష్టించినట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాట్లాడుతున్నాయి. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయానికి కేంద్రం చేసిన సాయం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. రాజకీయాలంటే దూషించడమే అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు పత్తికి మార్కెట్‌లో ధర లేదు. సీసీఐ పత్తి కొనకుంటే లక్షల మంది రైతులు రోడ్డున పడేవారు. కేంద్రం సాయంతో 1.20 కోట్ల టన్నుల పత్తిని సీసీఐ తీసుకుంది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి లేదు. పీఎం కిసాన్ ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేంద్రం ఇస్తోంది. మోదీ ఇస్తున్న పైసలు వస్తున్నాయి.రాష్ట్రం నుంచి మాత్రం పైసలు రావట్లేదని రైతులు మాట్లాడుతున్నారు. జనవరి నుంచి రైతుభరోసా ఇస్తున్నారు సంతోషం. కానీ రైతు ఈనాటికీ సంతోషంగా లేడని గ్రహించాలి. ఐదెకరాలున్న రైతు ఏడాది కష్టపడితే రూ.50 వేలు కూడా మిగలట్లేదు.
ఆసుపత్రికి వెళ్లినా 90 శాతం భారం ప్రభుత్వమే భరించాలి.
అల్లు అర్జున్‌పై కేసు కరెక్టే : ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ
పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న ఘటన విషయంలో ఆ చిత్రం హీరో అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సినిమా మొత్తం చూసి వెళ్లారు. దుర్ఘటనపై బాధ్యత లేకుండా సినిమా చూసి వెళ్లేటప్పుడు అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.