- రూ.3.57 కోట్లకు పైగా బకాయిలు
- ప్రభుత్వానికి ధాన్యం డబ్బులు ఎగ్గొట్టిన మిల్లు యజమాని
- ఆస్తులను జప్తు చేసిన అధికారులు
ముద్రణ ప్రతినిధి వనపర్తి, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలోని శివసాయి రైస్ మిల్ యజమాని జనుంపల్లి గ్రామానికి చెందిన డీలర్ వెంకట్రామి రెడ్డి కస్టం మిల్లింగ్ కోసం తీసుకున్న ధాన్యాన్ని మూడు సీజన్లుగా బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి బకాయి పడ్డాడు. అందులో భాగంగా శనివారం ఆయన భార్య విజయ పేరు మీద ఉన్న రైసుమిల్లులో, జనుంపల్లి గ్రామంలోని ఆయన ఇంట్లో పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, అధికార బృందం సోదాలు చేశారు. 2021–22కి సంబంధించి ఖరీఫ్, రబీ సీజన్లలో శివసాయి రైస్ మిల్లుకు ప్రభుత్వం 13,325 టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. 5,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 1,067టన్నులు మాత్రమే ఇచ్చారు. 4,561టన్నుల బియ్యం బకాయి ఉంది. దానికి మొత్తం రూ. 3,57,22,693 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ 7న మొదటిసారి నోటీసు ఇచ్చి అదేనెల 21 వరకు గడువు ఇచ్చారు. రెండోసారి ఆగస్టు 8న నోటీసు ఇచ్చారు.
23వ తేదీ శనివారం వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వానికి బకాయిలు చెల్లించిన తరువాత అధికారులు ఆయన ఇంట్లో టీవి, ఏసి, స్కూటీ, ఇతర వస్తువులను జప్తు చేశారు. ఈ సందర్భంగా డీలర్ వెంకట్రామిరెడ్డి కొంతసేపు ఇల్లు మూసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సముదాయించి ఆయనను బయటకు తీసుకొచ్చారు. జప్తుకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని తహసీల్దార్ లక్ష్మి మీడియాకు తెలిపారు. సోదాల్లోడీవో రవీంద్ర, శ్రీరంగాపూర్ ఎస్సై వెంకటేష్, డీటీ లక్ష్మికాంత్, ఆర్ఐ రాఘవేంద్ర, ఎస్సై, కానిస్టేబుళ్లు, సిబ్బంది ఉన్నారు.