- స్వర్ణకవచాలంకృత రూపంలో అమ్మవారి దర్శనం
బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి… నిమిషములో కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి శ్రీ మాతా నిమిషాంబ దేవి అష్టాదశ 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిపూర్వకంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రజిత (వెండి) కవచం పైన స్వర్ణం (బంగారం) తాపడం చీరతో స్వర్ణకవచాలంకృత అలంకరణలో అమ్మవారు లక్ష్మీశోభతో దేదీప్యమానంగా వెలుగు దివ్వెల కాంతులతో మహోజ్జ్వలంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మొదట విఘ్నేశ్వర పూజ, ఆలయ సంప్రోక్షణ, అఖండ దీపారాధన, పుణ్యాహవాచనం, దీక్షధారణ, ద్వార పూజ, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, ధ్వజారోహణ, వాస్తు, యోగినీ, నవగ్రహ, చతుర్వేద పారాయణాలు, సర్వతోభద్ర మంటప ఆవాహన, ప్రధాన దేవతా కలశ స్థాపన, అగ్ని స్థాపన, మూల మంత్ర హోమం జరిగింది. తర్వాత భక్తులచే సామూహిక చండీ హోమం, నీరాజన మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం అనుగ్రహ భాషణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వేలాది మంది అశేష భక్త జనవాహినీ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ చైర్మన్ శ్రీ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు శ్రీ కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ఆలయ ప్రాంగణంలో ఉండి భక్తులకు ఏవిధమైన స్పందన కలుగకుండా చూసుకున్నారు. ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎస్. గౌరి శంకర్, డి. నర్సింగ్ రావు, ఎం. శ్రీనివాస్ రావు, ఎం. సాయి బాబా (శ్యామ్), డి.సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి.హిమచందర్, వై. చంద్రశేఖర్, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్, వై. సత్యనారాయణలు కూడా ఆలయంలోనే ఉన్నారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర్ శర్మ మిగిలిన అందరు అర్చక స్వాములను సమన్వయం చేసుకుంటూ అమ్మవారికి, ఇతర ఉపాలయాల్లో ఎక్కడా పూజాదికాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు.