ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విమోచనం కోసం ప్రజలు చేసిన ఉద్యమం చరిత్రాత్మకమని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. 76 ఏళ్ల విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.
భారత దేశానికి 1947 ఆగస్టు 15 నాటికే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ , హైదరాబాద్ స్టేట్ లో ఉన్న తెలంగాణ , మరాట్వాడ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛావాయువులు పీల్చారని తెలిపారు. విమోచన ఉద్యమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. నేటి తరాలకు విమోచన ఉద్యమంలో ఎదురైన దుర్భర పరిస్థితుల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాటి నాయకుల త్యాగాలను గుర్తుంచుకుని, విమోచనం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటామని ప్రజలకు ఆయన ఉన్నారు.