ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం ఎంతో వెచ్చిస్తోందని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు.
వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్స్, బ్లాంకెట్లను, స్వెటర్లు, రింగ్ బాల్స్, చెస్ మెటీరియల్స్, సహా పలు ఆట వస్తువులను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందజేయాలని, ఈ సౌకర్యాన్ని చక్కగా వినియోగించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు భోజనం వడ్డించడానికి ముందు సూపర్‌వైజర్లు తినాలని, ఆ తర్వాత విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు.
హాస్టల్లో స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేసిన కలెక్టర్, మెస్ కమిటీ ఉందా అని సిబ్బందిని అడిగారు. వసతి గృహానికి వంట సామాగ్రి వచ్చినప్పుడు స్టాక్ రిజిస్టర్లలో విద్యార్థులచే కచ్చితంగా సంతకం చేయాలని సూచించారు. తప్పనిసరిగా మెస్ కమిటీ ఉండాలని విద్యార్థులకు వచ్చే ఆహార పదార్థాలు వాటి సామాగ్రిపై పర్యవేక్షణ ఉంచాలన్నారు. వంట సామాగ్రి వచ్చినప్పుడు అది నాణ్యత ఉందో లేదో చెక్ చేసిన తర్వాత దించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మల్లికార్జున్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు, ఉన్నారు.