భూదాన్ పోచంపల్లి, ముద్ర:- కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్ అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇప్పటికే ఐదు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసింది. ఉచిత కరెంటు, ఉచిత బస్సు, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ వంటి హామీలను అమలు చేసిందని, ప్రస్తుతం ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు.
గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం మే చివరి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఆరు నెలలు శ్రమించి పండించిన ధాన్యం వర్షాల కారణంగా తడిసి ముద్దయ్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిందని తెలిపారు. ఇప్పటికే ఐదుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, రెండు మూడు నెలల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గునిగంటి వెంకటేష్ గౌడ్ ,ప్రధాన కార్యదర్శి కుక్క కుమార్, నాయకులు టింగిల్ కార్ వెంకటేష్, కొట్టం కరుణాకర్ రెడ్డి, కీర్తి సంజీవని నిర్వహించారు.