ముద్ర, తెలంగాణ బ్యూరో:- రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో…. ఆ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26, 27 చివరి తేదీలు కాగా, సెప్టెంబర్ 3న ఈ ఎన్నిక జరగనుంది. అదేరోజు ఎన్నికల ఫలితాలను ఈసీ విడుదల చేయనుంది.
కాంగ్రెస్ కి మరో సీటు..
ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం బీఆర్ఎస్ కు చేజారిపోయింది. రాజ్యసభలో బీఆర్ఎస్ కు ఒక సీటు తగ్గనుంది. అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ స్థానం కాంగ్రెస్‌కు దక్కనుంది.