తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. అద్భుతమైన శిల్పకళతో అబ్బురపోయేలా అలంకరించిన ఆలయాన్ని తెలంగాణ నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. అయితే.. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు.. ఆలయ శిల్పకళను చూసి ముగ్దులవుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోతున్నారు. అయితే.. ఫొటోలు, వీడియోలు తీసుకోవటం రోజురోజుకు పెరిగిపోతుండగా.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలను నిషేధిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు మంగళవారం (అక్టోబర్ 22న) అధికారికంగా ప్రకటించారు.
ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా.. భక్తుల మనోభావాలు, విశ్వాసానికి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగితే తమకేం అభ్యంతరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే.. వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకుంటే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందన్న కారణంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.