- అధికార, విపక్ష పార్టీల మధ్య పెరిగిన లొల్లి
- బాధితుల పరామర్శకు బీఆర్ఎస్
- అడ్డుకున్న కాంగ్రెస్
- రెండు వర్గాల మధ్య హోరాహోరీ
ముద్ర, తెలంగాణ బ్యూరో:- రాష్ట్రంలో మూసీపై యుద్ధం సాగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య లొల్లి రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. సవాళ్లు….ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. ఈ అంశం ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ప్రధాన సమరంగా మారింది. మూసీ సుందరీకరణ కోసం ….మూసీ చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను రాష్ట్ర ప్రభుత్వం కాల్చివేస్తుండగా….. ఈ కూల్చివేతలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల పక్షాన అండగా ఉంటోంది. వారితో రాష్ట్ర ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తూ….నిరసన కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటోంది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య మూసీ చిచ్చు రావణ కాష్టంలా రగులుతోంది. పైగా మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభైవేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడంపై కూడా బీఆర్ఎస్ పార్టీ కన్నెర్ర చేస్తోంది. ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు నిధులు లేవంటూనే….రాష్ట్ర ప్రభుత్వం మూసీ ఇంత పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది.
సుందరీకరణ భారీ పేరుతో స్కాం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా….అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు నిధుల కటకట అంటూ నెలలను దాటేస్తున్న రేవంత్ సర్కార్……మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి సమీకరిస్తోందో చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోని ఇంత పెద్దమొత్తంలో నిధులు వెచ్చించినప్పటికీ వ్యవసాయరంగానికి ఏమైనా ఉపయోగమా….దీని వల్ల ఎంత మంది రైతులకు నీరందిస్తారో చెప్పాలని గులాబీ నేతలు నిలదీస్తున్నారు. రాష్ట్రానికి జీవ నాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ. ఎనభైవేలు కోట్లు ఖర్చు చేస్తేనే….ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గోలగోల చేశారన్నారు.
అటువంటప్పుడు తాగు నీటికి, సాగునీటికి ఉపయోగపడే మూసీ నదికి లక్ష యాభైవేలు కోట్లను ఖర్చు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో 55 సంవత్సరాల క్రితం ఉన్న మూసీ నది సుందరీ కరణం కోసం కాల్చివేస్తున్న కట్టడాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో బాధితులంతా ప్రస్తుతం బీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు బూటు తిడుతున్నారు.
జరుగుతున్న పరిణామాలు పైకి కాంగ్రెస్ గాంభీర్యాన్ని చూపిస్తున్నప్పటికీ….లోన మాత్రం ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ కూల్చివేతలతో అనవసరంగా బీఆర్ఎస్ కు ఆయుధాన్ని అందించామా? అన్న సందేహాలు అధికార పార్టీలో. కాగా ఈ కూల్చివేతలను ప్రధాన ఎజెండాగా చేసుకుని గులాబీ నేతలు తమ జోరును మరింతగా పెంచారు. కూల్చివేతలు జరిగిన ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అందరు కలిసి కట్టుగా ఉండి కూల్చివేతలను ఎక్కడిక్కడ అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇది సహజంగానే బాధితులకు కొండంత అండ ఇచ్చినట్లు అవుతోంది. దీంతో గులాబీ నేతలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముషీరాబాద్, అంబర్ పేట్ నియోజకవర్గాల్లో బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ యత్నించారు. అదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్ ను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు యత్నించారు. ముషీరాబాద్ లో అయితే కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. ఏకంగా కేటీఆర్ కారు ఎక్కి……గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు ఆయన కారుపై రాళ్ల దాడికి కూడా యత్నించారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం ముష్టి యుద్దాలకు దిగుతున్నట్లే కనిపించాయి. ఇక పరిస్థితి చేయి దాటి తున్నట్లే కనిపించింది. అయితే పోలీసులు సకలంలో జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చింది.
నీ తాటాకు చప్పుళ్ళకు భయపడు
ప్రజలకు అండగా నిలబడడాన్ని నువ్వు ఆపలేవని సిఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీ తాటాకు చెప్పుల్లోకి భయపడేవాడిని కాదు అని అన్నారు. నీ తాట తియ్యడానికి వచ్చానని అన్నారు. నీ పిల్లి కూతలకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అని కేటీఆర్. నాది ఉద్యమాల పిడికిలి ….గుర్తు పెట్టుకో అని సీఎంను హెచ్చరించారు. బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవన్నారు. కాంగ్రెస్ గుండా రాజ్యాన్ని… నియంతృత్వ పాలనను సవాలు చేసే నా స్ఫూర్తిని ఆపలేవన్నారు. నీ గుండాలు నా వాహనంపై చేసిన దాడి నాకు మరింత శక్తిని ఇస్తుంది.