- మూసీ వెంట కొనసాగుతున్న సర్వే
- ఆక్రమణ హద్దుల్లో మార్కింగ్
- విషం ఇచ్చి మార్కింగ్ చేయండి అంటూ నిర్వాసితుల గోడు
- పలు ప్రాంతాల అధికారులను అడ్డుకున్న వైనం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- నగరానికి మకుటయమాయంగా మూసీని సుందరీకరణ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మూసీపై వెలసిన అక్రమ కట్టడాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను శరవేగంగా చేయాలని తలపెట్టింది. దీంతో మూసీ నదిపై ఉన్న నివాసం ఉంటున్న వారికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. రేవంత్ సర్కార్ ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాలని బఫర్ జోన్, ఎఫ్ టిఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను నిర్ధాక్షణ్యంగా కూల్చివేస్తోంది. ఇప్పుడు దృష్టి మూసీపై పడడంతో….త్వరలోనే హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చే పనులపై దృష్టి సారించాయి.
ప్రత్యేకంగా 25 స్పెషల్ టీమ్ లను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం హైడ్రాకు మరి కొందరు అధికారులను, సిబ్బందిని కేటాయించారు. దీనితో హైడ్రా పూర్తి స్థాయిలో బలోపేతం కావడంతో….ఇక చకచక కూల్చివేతలను మొదలు పెట్టనుందని తెలుస్తోంది. దీంతో మూసీ వెంట ఉన్న అక్రమ నిర్మాణాల సర్వే కూడా చేస్తోంది. ఆక్రమణ హద్దుల్లోని నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ పనులను కూడా మొదలు పెట్టింది. ఇది మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. దీంతో కొందరు రేవంత్ సర్కార్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మార్కింగ్ కోసం వచ్చే అధికారులు, సిబ్బంది వాదనలకు దిగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేత జరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే మా ప్రాణాలను అయినా వదులుకుంటాం గానీ…..హైడ్రా అధికారుల కాలు కూడా పెట్టనివ్వమని ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో మూసీ సుందరీకరణ పనులు అంత ఈజీగా ప్రారంభం అవుతాయా? అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే, మార్కింగ్ చేసిన ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల అధికారుల సర్వేలను అడ్డుకునేందుకు బాధితులు యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా మూసీ రివర్ బెడ్‌లో మొత్తం 2166 ఇండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
సుమారు 55 మేర మూసీని సుందరీకరణ చేయాలని నిర్ణయించింది . అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల ఆక్రమాలకు గురైంది . ముఖ్యంగా జియాగూడ కమేల రోడ్డు, పురానాపూల్, అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్, మలక్ పేట్, అంబర్ పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, నాగోల్ తదితర ప్రాంతాల్లో మూసీలో అత్యధిక శాతం ఆక్రమణలు చోటు చేసుకున్నట్లు అధికారులు సర్వేలో తేలింది. జియాగూడ కమేల రోడ్డు, పురాణ పూల్, భూ లక్ష్మమ్మ టెంపుల్ సమీపంలో కొంత మంది మూసీని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు జరిపి అద్దెలకు ఇచ్చారు. దశాబ్ధాలుగా వీరిని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతూ సొంత ఆస్తులుగా వాడుకుంటున్నారు. అలాంటి దాడులను ప్రభుత్వం గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. కాగా తాజాగా మూసీలో కూల్చివేతలు మొదలు కావడంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి . అంతవరకు బాగానే వంద మీటర్ల పరిధి మూసీ ఎక్కడి నుంచి మొదలవుతుంది…. ఎక్కడితో ముగుస్తుందనేది అందరిలో సందేహంగా మారింది.
ఈ విషయంలో అధికారుల వద్ద కూడా స్పష్టత లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు . కొంతమంది మూసీ ఇరువైపులా యాభై మీటర్ల చొప్పున వంద మీటర్ల మేర కూల్చివేతలు ఉంటాయంటుండగా మరికొంత మంది ఇరువైపులా వంద మీటర్ల చొప్పున ఉంటుందనే ప్రచారం చేస్తున్నారు. ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని మరింత ఆందోళనలకు గురిచేస్తోంది. మరికొంత మంది ఒకడుగు ముందుకు వేసి యాబై మీటర్లు ఎక్కడి వరకు వస్తుంది.. ? వంద మీటర్ల అయితే ఎంత ఉంటుందో టేపులతో కొలతలు వేసి తమ ఆస్తులు ఉంటాయా, కూలగొడతారా అనే అంచనాకు వస్తున్నారు. మొత్తం మీద మూసీ టెన్షన్…. పరిసర ప్రాంతవాసులకు సరికొత్త ఆందోళనకు గురిచేస్తోంది.