- నేటి నుండి ఆరుట్ల బుగ్గ జాతర ఉత్సవాలు ప్రారంభం
- కార్తీక మాసంలో పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
- సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబు
- రాష్ట్ర నలుమూలల నుండి తరలిరానున్న భక్తులు
- పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి – ఎమ్మెల్యే మల్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: 'దక్షిణ కాశీ'గా పేరొందిన ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, కార్తీక స్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధి ఆరుట్ల గ్రామానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో దట్టమైన ప్రాంతంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం చుట్టూ కొండలు, గలగలపారే సెలయేరులు, పచ్చని చెట్లు, సువిశాల ప్రదేశం ప్రాంతంలో ఉంది. పర్యాటక, పర్యావరణ ప్రియులు అమితంగా ఇష్టపడే వాతావరణం ఈ ప్రాంతం సొంతం. ఇక్కడికి భక్తుల కోరికలను కోరుకోవడానికి, కోరిన కోరికలు తీరగా తిరిగి దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు దైవదర్శనంతో పాటు చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రత్యేక అనుభూతిని పొందుతారు. ప్రతియేడాది కార్తీక మాసంలో పదిహేను రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మో త్సవాలను బుగ్గ జాతర, కార్తిక స్నాన ఉత్సవంగా పిలుస్తారు. జాతరకు కేవలం రంగారెడ్డి జిల్లా నుండి కాక చుట్టు ప్రక్కల వికారాబాద్, మెడ్బెల్, భువనగిరి, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ తో పాటు ఇతర జిల్లాల నుండి ఎంతో మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు వీచ్చేసి కార్తీక మాస పవిత్ర స్నానాలను ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు.
కార్తీకమాసం పౌర్ణమి రోజున ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యి అమావాస్య రోజున ముగుస్తాయి. యేడాదిలో ఒక్కసారైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే పాప నాశనం జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీన కాలం నుంచి పుణ్యక్షేత్రం ఉన్నా 1970వ దశకంలో ప్రాచూర్యం పొందింది. అప్పటి వరకు దేవాలయాన్ని కేవలం పుణ్యక్షేత్ర రామాలయంగానే చెప్పుకునేవారట. తరువాతి కాలంలో ఇక్కడ కొలువుదీరిన దేవతామూర్తులు రాతి శిల్పాలను పరిశీలించిన ఓ ప్రభుత్వాధికారి ఈ విగ్రహం ఉమామహేశ్వరులదని చెప్పారట. అప్పటి నుంచి ఈ ఆలయం బుగ్గరామలింగేశ్వరాలయంగా ప్రసిద్ధిచెందింది. గతంలో వర్షాలు లేక గుండంలో నీటి కొరత ఏర్పడినా దేవాదాయశాఖ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. రెండు, మూడేళ్లుగా వర్షాలు కురవడంతో భక్తులు స్నానాలు ఆచరించేందుకు పూర్తిగా ఇబ్బందులు తొలగిపోయాయి. భక్తుల సంఖ్యకు దృష్టిలో పెట్టుకొని ప్రత్నామ్యాయంగా అవసరమైన వాటిని కూడా ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా కబీర్ దాస్ మందిరం
బుగ్గ పుణ్యక్షేత్రం సమీపంలోని ఎత్తుపై కబీర్ దాస్ మందిరం ఉంటుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ లాలాపేటలో ఉన్న కబీర్ దాస్ భక్తసమాజానికి చెందినవారు ప్రకృతి రమణీయ ప్రాంతంలో మందిరాన్ని నిర్మించాలని సంకల్పించి కాశీలో ఉపదేశం పొందిన నర్సింహా బాబా అనే సాదువు ఈ మందిరాన్ని 1974లో నిర్మించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని వచ్చే భక్తులు కబీర్ దాస్ మందిరాన్ని తప్పక దర్శించుకుంటారు.
బుగ్గ జాతరకు ఎలా వెళ్లాలంటే?
బుగ్గ రామలింగేశ్వర దేవాలయం ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి 12 దూరంలో ఉంటుంది. పూర్వం భక్తులు ఇక్కడికి ఎడ్లబండ్లు, కాలినడకన వచ్చే వారు. క్రమంగా జాతర జరిగే పదిహేనురోజుల పాటు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నారు. ఉత్సవాల సందర్భంగా ఇబ్రహీంపట్నం నుంచి, అటు నల్గొండ జిల్లా చౌటుప్పల్, నారాయణపురం నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సులే కాకుండా ఇబ్రహీంపట్నం నుండి ప్రైవేట్ వాహనాలకు కొదవే లేదు. ఇక కార్లు, బైకులపై వచ్చే వారు వివిధ మార్గాల ద్వారా మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి కేవలం మూడు దేవాలయంలో బుగ్గ రామలింగేశ్వర రాలయం ఉంటుంది. ప్రస్తుతం నగరం నుంచి ఇబ్రహీంపట్నం, ఇక్కడి నుంచి ఆరుట్ల బుగ్గజాతర వరకు అధికారులు బస్సులను అదనంగా తీసుకుంటున్నారు.
నేటి బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి నుంచి బుగ్గ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కార్తీకమాస ఉత్సవాలు ప్రారంభం అయ్యి డిసెంబర్ 1వ తేదీ వరకు పక్షం రోజుల పాటు కొనసాగుతున్నాయి. పది హేను రోజుల పాటు కొనసాగే ఉత్సవాల సంధర్భంగా స్థానిక ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాట్లను ఇప్పటికే వేగవంతం చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఉత్సవ నిర్వాహకులకు సూచనలు చేశారు.
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఎంతో మహిమగల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం. ఆలయానికి వచ్చేందుకు రహాధారులు నిర్మాణం సిసి రోడ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేపడతాం. ఈ ఏడాది జాతర ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు నిధులు ఇచ్చాం. వచ్చే ఏడాది నాటికి పెండిగ్ పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం.