- కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు
- బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బీసీ వర్గాల్లో చీలిక తీసుకురావడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుట్ర పన్నారని బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ధ్వజమెత్తారు. అందుకే రాహుల్ సూచనలతో రేవంత్ సర్కార్ కులగణన సర్వే చేపట్టిందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర మీడియాతో ఆనందర్ గౌడ్ మాట్లాడారు.. కులగణనను బీజేపీ వ్యతిరేకించదని అన్నారు. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారని అన్నారు. తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేసిన అన్యాయంపై క్షమాపణ చెప్పాలని తమ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న బీసీ మంత్రులు తమ సీఎం రేవంత్ రెడ్డి ఎవర్ని తిట్టమంటే వారిని తిడుతున్నారు. బీసీలకుపదవులు ఇచ్చి ఇతరులను తిట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానని ఆయన దుయ్యబట్టారు. కేవలం పనిగట్టుకుని ఇతర పార్టీలోని బీసీ నేతలనే టార్గెట్ గా చేసుకుని బీసీ మంత్రులు తిడుతున్నారు. మంత్రివర్గంలో ఉన్న బీసీ మంత్రులు ఇప్పటి వరకు బీసీ వర్గాలకు చేసి మేలు ఏమి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.