ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. భాగంగా బుధవారం నాడు హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్రంలో అన్ని జిల్లాల బీజేపీ అధ్యక్షుల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు మూకుతాడు వేసినట్లే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వేయాలని బీజేపీ భావిస్తున్నది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అనుకున్న స్థాయిలో కేటాయింపులు చేయలేదని కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లింది.
ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగాలనే ప్రణాళికలను రచించేందుకు సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వలన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమైందనే విషయాన్ని గట్టిగా ప్రచారం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో బీజేపీ బలహీనంగా ఉంది. దీనిని అధిగమించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకుని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.