గోపీచంద్‌కి ఒక సాలిడ్ హిట్ పడక కొన్ని సంవత్సరాలవుతోంది. ఎన్నిరకాల డైరెక్టర్ ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ముందుకొచ్చినా అతన్ని హిట్ ట్రాక్‌లోకి తీసుకురాలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన విశ్వం కూడా అతన్ని నిరాశపరిచింది. ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ చాలా క్రిటికల్‌గా ఉంది. తనకు జిల్ వంటి హిట్ సినిమా ఇచ్చిన రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ సినిమా అనుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా యువి క్రియేషన్స్ పక్కన పెట్టేసింది. గోపీచంద్, రాధాకృష్ణ కాంబినేషన్లో వచ్చిన జిల్ కూడా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం70ఎంఎం ప్రొడక్షన్స్ సంస్థ చేతికి వెళ్లినట్టు తాజా సమాచారం.
ప్రభాస్‌కి గోపీచంద్ మంచి మిత్రుడు కావడం వల్ల అతని సొంతలాంటి యువి క్రియేషన్స్ గతంలో జిల్ నిర్మించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం చేయాలనుకున్నారు. కానీ, సంస్థ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అందుకే గోపీచంద్ సినిమాను వదులుకుంది. ఇటీవల విడుదలైన కంగువా స్టూడియో గ్రీన్‌తో కలిసి యువి క్రియేషన్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇందులో కూడా యువి క్రియేషన్స్‌కి భారీ నష్టం వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై చాలా పెట్టుబడి పెట్టి ఉండటం వల్ల మరో సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది.
విశ్వంభర సంక్రాంతికి విడుదల’ ప్లాన్ చేసినప్పటికీ అది వాయిదా పడింది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలకు కూడా బ్రేక్ పడింది. అంతకుముందు అఖిల్‌తో కూడా ఒక సినిమా చేయాలనుకున్నారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ సినిమా కూడా పక్కన పెట్టారని. విశ్వంభర చిత్రం బిజినెస్ జరిగితేనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. అప్పటివరకు మరో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం లేదు. ప్రస్తుతం వరుణ్‌తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నారు. అది కూడా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మించారు. దీన్ని బట్టి యువి క్రియేషన్స్ సంస్థ ఇప్పట్లో కొత్త సినిమా స్టార్ట్ చేసే అవకాశం లేదనేది అర్థమవుతోంది.