ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం అద్భుతంగా ఉందని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆలిండియా సర్వీసెస్ అధికారుల బృందం కొనియాడారు. ప్రజాభవన్ లో తమ సమస్యలను విన్నవించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం విశేషమని అధికారుల బృందం అభిప్రాయపడింది. ఈ మేరకు మంగళవారం ప్రజాభవన్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ,ప్రజావాణి ఇన్ చార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లతో అధికారుల బృందం భేటీ అయ్యింది.
ప్రజావాణిలో ఉన్న తీరును ఈ సందర్భంగా చిన్నారెడ్డి, దివ్య కలిసి అధికారుల బృందానికి వివరించారు. బృందంలోని కొంత మంది అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు వెంటనే అర్జీలు అందజేసిన సమస్యలను ఓపికతో విని సీఎం ప్రజావాణి పోర్టల్ ద్వారా సంబంధిత శాఖల అధికారులకు పంపుతామని, ప్రజావాణి పేరుతో ఏకనాలెడ్జెమెంట్ ఇస్తామని, ప్రజల సమస్యల పరిష్కారం వరకు నిరంతరంగా ఫాలో అవుతుందని, దివ్య తెలిపారు. అర్జీలు స్వీకరించి వాటిపై ఎండార్స్ మెంట్ చేసి, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని అధికారుల బృందానికి వివరించారు.