Home సినిమా 'పుష్ప 2: ది రూల్' మూవీ రివ్యూ – Prajapalana News

'పుష్ప 2: ది రూల్' మూవీ రివ్యూ – Prajapalana News

by Prajapalana
0 comments
'పుష్ప 2: ది రూల్' మూవీ రివ్యూ


తారాగణం: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ బండారి, ధనంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఉత్పత్తి తయారీ: ఎస్. రామకృష్ణ, మోనిక
డీఓపీ: మిరోస్లా కూబా బ్రోజెక్
ఎడిటర్: నవీన్ నూలి
రచన, దర్శకత్వం: సుకుమార్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ: డిసెంబర్ 5, 2024

ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన సినిమా అంటే 'పుష్ప-2' అని చెప్పవచ్చు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సంచలనం సృష్టించిన 'పుష్ప-1'కి కొనసాగింపుగా రూపొందిన చిత్రం 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఇంతటి హైప్ తో తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన 'పుష్ప-2' ఎలా ఉంది? అంచనాలను అందుకుందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (పుష్ప 2 సమీక్ష)

కథ:
ఎర్ర చందనం స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కూలీగా ప్రయాణం మొదలుపెట్టి, అనతికాలంలోనే స్మగ్లర్ గా ఎదిగిన పుష్పరాజ్(అల్లు అర్జున్).. శత్రువుల అంతు చూస్తూ, తనకు ఎదురే లేదన్నట్టుగా దూసుకుపోతుంటాడు. అలాంటి పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్(ఫహద్ ఫాజిల్) అనే డేంజరస్ పోలీస్ అధికారి ఈగో హర్ట్ చేసి, అతనికి మారుతాడు. ఇది ఫస్ట్ పార్ట్ లో చూశాం. సెకండ్ పార్ట్ కి విషయానికి వస్తే.. ఎర్రచందనం సిండికేట్ కింగ్ గా ఎదిగిన పుష్పరాజ్, సీఎం తో ఫొటో దిగాలి అనుకొని అవమానం ఎదుర్కొంటాడు. దీనితో ఎలాగైనా ఆ సీఎం ప్లేస్ లో, తన మనిషి అయిన ఎంపీ సిద్ధప్ప(రావు రమేష్)ను సీఎం చేయాలి అనుకుంటాడు. ఈ పుష్పరాజ్ కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అది తన ఎర్ర చందన సామ్రాజ్యంపై ఎలాంటి ప్రభావం చూపింది? మరో వైపు పుష్పరాజ్ దూకుడికి కళ్లెం వేయాలనుకున్న షెకావత్ చేశాడు? పుష్పరాజ్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ:
నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంటే ఒక్క డైలాగ్ తోనే.. పార్ట్-1 ని మించి పార్ట్-2 భారీగా ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే పుష్పరాజ్ పాత్రను, సన్నివేశాలను మరింత పవర్ ఫుల్ గా, భారీగా డిజైన్ చేశారు. పార్ట్-1 ఎక్కడ ముగిసిందో, పార్ట్-2 అక్కడే మొదలైంది. జపాన్ పోర్ట్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో పుష్పరాజ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి పుష్పరాజ్, షేకావత్ మధ్య ఈగో క్లాస్ తో సినిమా నడిచింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా డ్రామా మీద దృష్టి పెట్టాడు దర్శకుడు సుకుమార్. ఓ వైపు హీరోయిజంని చూపిస్తూనే, మరోవైపు డ్రామాని పండించాడు. ఇంటర్వల్ బ్లాక్ అదిరిపోయింది. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ లో కూడా అదే టెంపో కొనసాగింది. ముఖ్యంగా 20 నిమిషాల జాతర ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది. అయితే ఆ తర్వాత గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. పతాక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.

పుష్ప-2 సినిమా ఒక కథలా కాకుండా, కొన్ని ఎపిసోడ్స్ లా నడుస్తుంది. సినిమా అంతా పుష్పరాజ్ పాత్ర ప్రధానంగా సాగుతుంది. అతని మాటలు, చేతలు అలరిస్తాయి. అయితే అసలు అతని ప్రధాన లక్ష్యం ఏంటి? అనే చూస్తే దానిపై ప్రేక్షకులకు ఒక స్పష్టత రాదు. అదే ఈ సినిమాకి మైన్స్. శేకావత్ పాత్ర కూడా మొదట్లో కనిపించినంత బలంగా తర్వాత ఉండదు. అలాగే కొన్ని సీన్స్ దర్శకుడు సుకుమార్ స్థాయికి తగ్గట్టుగా లేవు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని, మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని.. పక్కా కమర్షియల్ లెక్కలతో సుకుమార్ ఈ సినిమా తీశాడని చెప్పవచ్చు. పుష్పరాజ్ పాత్రని మలిచిన తీరు, ఎలివేషన్స్ ని, యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేసిన తీరు, డైలాగ్స్, సాంగ్స్ ఇలా ప్రతి దానిలో స్పష్టమవుతోంది. అయితే కొన్ని సీన్స్, ఎలివేషన్స్ ఓవర్ ది టాప్ అనిపించాయి. ఇవి జనరల్ ఆడియన్స్ ఎలా రివేల్ చేసుకుంటారు అనేది చూడాలి. అలాగే సినిమా నిడివిని కుదించే ప్రయత్నం చేస్తే బాగుండేది. హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ని నమ్ముకొని రెగ్యులర్ టెంప్లేట్ కమర్షియల్ సినిమాని 3 గంటల 20 నిమిషాల పాటు సాధారణ ప్రేక్షకులు చూడాలంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పుష్ప-3 లీడ్ కోసం అన్నట్టుగా ల్యాగ్ చేయకుండా.. రన్ టైం ని తగ్గించి పార్ట్-2 తోనే ఇక ఈ కథని ముగిస్తే బాగుండేది.

పుష్ప-1 కి పాన్ ఇండియా క్రేజ్ రావడంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఆయన స్వరపరిచిన పాటలు ఒక ఊపు ఊపాయి. మరీ ఆ స్థాయిలో కాకపోయినా పుష్ప-2 పాటలు కూడా మెప్పించాయి. సినిమాలో సాంగ్స్ ప్లేస్ బాగానే కుదిరింది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. చాలా సన్నివేశాలను తన బీజీఎం తో మరో స్థాయికి తీసుకెళ్ళాడు దేవి. అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినట్లు స్క్రీన్ మీద సామ్ SI పేరు వేశారు. మిరోస్లా కూబా బ్రోజెక్ కెమెరా పనితనం బాగుంది. తనదైన ఫ్రెమింగ్, లైటింగ్ తో పుష్ప ప్రపంచాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఎడిటర్ గా నవీన్ నూలి తన పనితీరు కనబరిచాడు. అయితే నిడివి విషయంలో దర్శకుడి నిర్ణయానికి అనుగుణంగా వెళ్లినట్లు అర్థమవుతోంది. డైలాగ్స్ అదిరిపోయాయి. ఫస్ట్ పార్ట్ ని మించిన పవర్ ఫుల్ అండ్ క్యాచీ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపించింది.

నటీనటుల పనితీరు:
'పుష్ప-1'లో తాను పోషించిన పుష్పరాజ్ పాత్రకి గాను, నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. మరోసారి పుష్పరాజ్ పాత్రలో చెలరేగిపోయాడు. పుష్పరాజ్ గా ఆయన యాటిట్యూడ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ టాప్ క్లాస్ లో ఉన్నాయి. అన్ని ఎమోషన్స్ ని చక్కగా పలికించాడు. యాక్షన్ సన్నివేశాల్లో రెచ్చిపోయాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో విశ్వరూపం చూపించాడు. పుష్పరాజ్ భార్య శ్రీవల్లి పాత్రలో రష్మిక అభినయంతో ఆకట్టుకుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో కాస్త అతిగా అనిపించింది. ఇక పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ ఫాజిల్.. అల్లు అర్జున్ కి ధీటుగా నటించాడు. కిస్సిక్ సాంగ్ లో శ్రీలీల తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది. జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ బండారి, ధనంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా…
ఇది అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించిన పక్కా కమర్షియల్ సినిమా. సుకుమార్ తన లాజిక్స్ ని, లెక్కలని పక్కన పెట్టి.. మ్యాజిక్ తీసిన మాస్ సినిమా. బన్నీ ఫ్యాన్స్ , మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమా.

రేటింగ్: 2.75/5


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech