- ఆ సినిమాకు జాతీయ అవార్డు ఏంటి..?
- రెండు హత్యలు చేసిన నిందితుడు పుష్ప 2 చూస్తూ పట్టుబడ్డాడు
- ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచుతున్నాయి
- మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఒక ఎర్రచందనం స్మగ్లర్ పోలీసుల బట్టలు విప్పించి నిల్చోబెట్టిన పుష్ప చిత్రానికి జాతీయ అవార్డు ఇవ్వడం దారుణమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో నేర ప్రవృత్తిని పెంచే ఇలాంటి సినిమాలు రావడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు. పుష్ప సినిమాలో స్మగ్లర్‌ను హీరో చేసిన నిర్మాతలు.. పోలీసులు, లాయర్లను విలన్‌లుగా ఫోకస్ చేశారు. పుష్ప 2 సినిమా రిలీజింగ్ రోజు జరిగిన సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో మహిళా ప్రాణాలు కోల్పోయాడు, బాలుడు కోమాలో ఉన్న ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించిన మంత్రి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండు హత్యలతో పాటు డ్రగ్స్ రవాణా, ఇతర హింసాత్మక సంఘటనలతో 27 కేసులు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్‌స్టర్ విశాల్ మేశ్రాం.. నాగ్‌పూర్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో పుష్ప-2 సినిమా చూస్తూ పోలీసులకు చిక్కాడు. పుష్ప లాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచే విధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మానవతా దృక్పథాన్ని పెంచే విధంగా సినిమాలు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని.. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవని ఆమె ఘాటుగా స్పందించారు.