- అందుకే గాంధీ ఆసుపత్రిలో 48 మంది చిన్నారులు, 14 మంది బాలింతలు మృతి చెందారు
- ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ పై రెచ్చిపోయిన కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- పాలనను గాలికి వదిలిపెట్టి కేవలం ప్రచార ఆర్భాటాలు….విగ్రహ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మునిగి తేలడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీని కారణంగానే రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. రాష్ట్రమంతా విషజ్వరాలతో అల్లాడుతుంటే….సీఎం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కనిపించిందని. ఫలితంగా గాంధీ ఆసుపత్రిలో 48 మంది చిన్నారులు, 14 మంది బాలింతలు మృతి చెందారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తను ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోందన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా…? అన్న అనుమానం తలెత్తింది. ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రిలో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాల'కు విలువ లేదా? ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉందా? అని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే సర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తోంది… ఎందుకు భయపడుతోందని నిలదీశారు. ఆ తల్లీబిడ్డల ఉసురు మీకు తగలదా… ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే, రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉందని పేర్కొన్నారు.
గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్లు, సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లి, బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేలా కేసీఆర్ వ్యవస్థలను తయారు చేశారన్నారు. అది ఓ పాలకుడిగా ప్రజల బాధ్యత తీసుకోవడన్నారు.మరీ మన చీప్ మినిస్టర్ ఏం చేస్తున్నారో…? అంటూ సైటర్లు వేశారు. ఇప్పటికైనా రేవంత్ రాజకీయాలనుపెట్టి పాలన మీద దృష్టిసారించే ప్రజలకు మేలు జరుగుతాయి. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహంలో రేవంత్ కొట్టడం ఖాయమని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు.