ముద్ర,సెంట్రల్ డెస్క్:-భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్ 2024లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఘన విజయంతో ఆమె ఈ ఒలింపిక్స్ జర్నీని ప్రారంభించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న ఈ ఒలింపిక్ క్రీడల్లో తెలుగమ్మాయి సింధు తన ప్రత్యేకతను చాటుకుంది.
తొలి మ్యాచ్‌లో ఆమె మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫతీమత్ నబాబా అబ్దుల్ రజాక్ పై సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రజాక్.. సింధుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు కేవలం 29 నిమిషాల్లోనే వరుసగా రెండు సెట్లలో మాల్దీవ్స్ క్రీడాకారిణిని చిత్తుచేసింది. రెండు సెట్లలో 21-9, 21-6 తేడాతో సింధు గెలిచింది.
సింధు తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ఎస్తోనియా షట్లర్ క్రిస్టిన్ కూబాతో తలపడనుంది. జూలై 31న ఈ మ్యాచ్ జరగనుంది. కాగా సింధుకు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడోసారి. ఆమె 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.