- రూ. 17,043 కు పెరిగిన పామాయిల్ గెల ధర
- గతంలో గెలకు రూ. 14,392
- రాష్ట్ర రైతులకు రూ. 12 కోట్ల లాభం
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
ముద్ర, తెలంగాణ బ్యూరో :పామాయిల్ రైతులకు దసరా కానుక అందించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడిపాయిల్ గెలల ధర రూ. 14,392 నుండి అమాంతం రూ. 2651 పెరిగి ప్రస్తుతం రూ. 17,043 చేరుకుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి. దీని వలన రైతులకు ఈ నెలలో అదనంగా రూ. 12 కోట్లు లబ్ధి చేకూరనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు. గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ గెల ధర తగ్గి రైతులు నిరాశలో ఉన్నారని, కొత్తగా ఆయిల్ పామ్ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రి తుమ్మల అన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మంత్రి తుమ్మల పామ్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్‌కు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించే విధంగా సహకరించాలని, ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను ప్రకటించారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఈ విషయంపై మంత్రి తుమ్మలతో పాటు ఆయిల్ పామ్ రైతులు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ధరల పెరుగుదలతో 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తుమ్మల వివరించారు. పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల విదేశీమారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించినందున దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం చేస్తారని, అదనంగా గెలల ధరల పెరుగుదల కారణంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులిచ్చిందని, ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 2.23 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం లేదని, ఆయిల్ పామ్ కంపెనీలకు సన్నద్ధం కావాలని మంత్రి తుమ్మల సూచించారు.