- డిగ్రీతో పాటు బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ
- 20 ఇంజనీరింగ్, 18 డిగ్రీ కాలేజీల ఎంపిక
- ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అమలు
- ఉచితంగా ఖరీదైన కోర్సు.. జాబ్ గ్యారంటీ లక్ష్యం
- 25వ తేదీన ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ముద్ర, తెలంగాణ బ్యూరో :- వేలాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇటీవలే యంగ్ స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఖరీదైన సాంకేతిక కోర్సులను విద్యార్ధులకు ఉచితంగా అందించడంతో పాటుగా వారికి జాబ్ గ్యారెంటీగా లభించే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా మరో వినూత్న శ్రీకారం చుట్టింది.
బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌లోని ఐటి, ఐటిఐఎస్ నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేండ్లుగా ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్చెంజీ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బీఎస్‌ఎఫ్‌ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్‌ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ రంగంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ కోర్సులో ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు శిక్షణకు ఖర్చు అవుతోంది. శిక్షణ తర్వాత విద్యార్థులు తమ సంస్థలో పని చేస్తారా? లేదా? ఎక్కువ ప్యాకేజీలకు మరో సంస్థకు వెళతారా? అనేది కూడా గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు ప్రధాన సవాలుగా మారింది.
అందుకే పరిశ్రమల అవసరాలను, ఇప్పుడున్న సవాళ్లను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగానే బీఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులతో జనవరి సమావేశమయ్యారు. ఈ డిమాండ్‌కు అవసరమైన ఉద్యోగాలను కల్పించే దిశగా యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటు నైపుణ్యం డిగ్రీ కోర్సును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ఉన్నత విద్యామండలి , బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్… ఇన్సూరెన్స్ కన్సార్టియంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఖరీదైన ఈ మినీ డిగ్రీ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. సాధారణ డిగ్రీ కోర్సుతో పాటుగానే దీన్ని నేర్పిస్తుంది. రాష్ట్రంలో ఈ ఏడాది తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంపిక చేసిన 20 డిగ్రీ కాలేజీలు, 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కోర్సులను నిర్వహిస్తుంది. ప్రస్తుత సంవత్సరం అకడమిక్ ఇయర్ (2024–2025) నుంచే ఈ కోర్సులను ప్రారంభిస్తోంది. ఈ నెల 25వ తేదీన నైపుణ్య శిక్షణ కోర్సులను సీఎం ప్రారంభించనున్నారు.
ఇందులో 5000 మంది ఇంజనీరింగ్, 5000 మంది నాన్ ఇంజనీరింగ్… మొత్తం 10 వేల మంది విద్యార్థులకు ఈ వర్క్ కోర్సు నేర్పిస్తారు. అత్యంత ఖరీదైన కోర్సు కావటంతో రివాల్వింగ్ ఫండ్‌తో పాటు సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులతో ఈ ప్రోగ్రాం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకపోవటంతో పాటు విద్యార్థులకు ఖరీదైన ఫీజుల భారం తప్పనుంది.
ఇప్పటికే వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈక్విప్ (ఇక్యూయుఐపిపి) అనే సంస్థ ను ఈ ప్రోగ్రాం నిర్వహణకు ఎంపిక చేశారు. అటు బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలతో అనుసంధానానికి, మరోవైపు సంస్థతో భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ ముందుకు వచ్చింది. తొలి విడతగా ఈ సంస్థ రూ.2.50 కోట్లకు సిద్ధమైంది. ప్రతి పది వేల మంది విద్యార్థులకు మూడేండ్ల పాటు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్ ను ఈ సంస్థ సమీకరిస్తుంది. డిగ్రీ కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ కోర్సులో భాగంగా స్కిల్ ఎన్ హాన్స్‌మెంట్ -కోర్స్, జనరిక్ ఎలెక్టివ్స్ పాఠ్యాంశాలను పరిచయం చేస్తారు.ఇంజనీరింగ్ కాలేజీల్లో దీన్ని మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్, యాక్సిలరేటెడ్ కోర్సుగా అందిస్తారు. ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్ , పాఠ్యాంశాలను బీఎఫ్ఎస్ఐఐ కన్సార్టియం తయారు చేసింది. ఈ పాఠ్య ప్రణాళికను బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదించింది. డిగ్రీతో పాటు ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌తో పాటు అర్హులైన వారందరికీ ఇంటర్ షిప్‌తో పాటు ఉద్యోగం లభించేలా ఈ ప్రోగ్రాం రూపొందించారు.