- ఏపీ క్యాడర్ ఐఏఎస్ లపై క్యాట్ ఫైర్
- ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలి ఆదేశం
- డీవోపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్టు చేయాల్సి ఉందని స్పష్టీకరణ
- ఐఎస్ అధికారులకు 'క్యాట్'లో దక్కని ఊరట
- నేడు రిలీవ్ కానున్న ఐదుగురు ఐఏఎస్ లు
- వారి స్ధానంలో సీనియర్లు, అనుభవజ్ఞులకు అవకాశం
- క్యాట్ తీర్పుపై నేడు హైకోర్టుకు ఐఎస్‌లు.?
ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణలోనే కొనసాగుతామన్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు ఏపీ క్యాడర్ కు చెందిన వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి సృజన, రోనాల్డ్ రోజ్‌లపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఫైర్ అయింది. బాద్యతాయుత ఉన్నత హోదా కలిగి ఉండి మీరు చేస్తున్నది ప్రజాసేవానా.? లేక ఆటవిడుపు అనుకుంటున్నారా..? అని నీలదీసింది. ఏ క్యాడర్ కు చెందిన వాళ్లు ఆయా రాష్ట్రాల్లోనే పని చేయాలని స్పష్టం చేశారు. డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రిపోర్టు చేయాలని సూచించింది. విజయవాడలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే.. సేవ చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ నిలదీసింది. సరిహద్దుల్లో సమస్యలు వస్తే వెళ్లరా? ఇంట్లో కూర్చొని సేవ చేస్తామంటే ఎలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. 1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేస్తారు? అంటూ మండిపడింది. ఏపీ క్యాడర్‌కు కేటాయించబడి తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ లు ఈ నెల 16న ఏపీకి వెళ్లిపోవాలని ఇదివరకే డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో డీవోపీటీ ఉత్తర్వుల రద్దు కోరుతూ ఏపీ క్యాడర్‌కు చెందిన వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి సృజన, రోనాల్డ్ రోజ్ ఈ నెల 14న క్యాట్‌ను ఆశ్రయించారు. మంగళవారం విచారణ క్యాట్ ఐఏఎస్‌ల పిటిషన్‌పై విచారణలో క్యాట్ ప్రశ్నాస్త్రాలు సంధించింది.
తాము తెలంగాణలోనే కొనసాగుతామని నలుగురు ఐఏఎస్ లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. డీవోపీటీ ప్రకారం వారందరినీ ఆయా రాష్ట్రాలకు వెంటనే వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఏపీకి వెళ్లడం ఇష్టం లేని ఐఏఎస్ లు చివరి ప్రయత్నంగా క్యాట్ తీర్పుపై నేడు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా ఇప్పటికే డీవోపీటీ, క్యాట్ ల తీర్పు, అది కాదని హైకోర్టు తీర్పు ఇస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే.. ఉమ్మడి ఏపీ విభజన సమయం 2014లో అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కేంద్రం విభజించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలను కేటాయించింది కేంద్ర సిబ్బంది సంబంధిత శాఖ. కొన్ని కేంద్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డీఓపీటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అధికారులు తమకు కేటాయించిన సొంత క్యాడర్ లోనే కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్‌లు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతిలతో పాటు ఇక ఐపీఎస్ కేడర్‌కు చెందిన అంజనీ కుమార్, అభిలాశ్ బిస్త్, అభిషేక్ మహంతిలను కేంద్రం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు అలాట్ చేసింది. మరోవైపు సృజన, శివశంకర్, హరికిరణ్‌లను ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇంకోవైపు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తామన్న ఎస్.ఎస్.రావత్, అనంతరాము అభ్యర్థనలను కేంద్రం రద్దు చేసింది. దీంతో ఏపీ క్యాడర్ లోనే వీరిద్దరూ కొనసాగుతున్నారు.
నేడు ఐఏఎస్ లు రిలీవ్…
క్యాట్ తీర్పు నేపథ్యంలో ఏపీకి వెళ్లాల్సిన ఆ క్యాడర్ అధికారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు రిలీవ్ చేసే అవకాశం విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు క్యాట్ డైరెక్షన్స్ తో తెలంగాణ క్యాడర్ లో కొనసాగుతున్న వీరిని డిఓపీటీకి లోబడి రిలీవ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే.. ప్రస్తుత ప్రభుత్వంలో హోదా, బాద్యతల్లో కొనసాగుతున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ లు స్వరాష్ట్రానికి వెళ్తే తెలంగాణలోనూ ఐఏఎస్ ల బదిలీలు తప్పని సరిగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్‌ఎంసి కమిషనర్ పోస్టును మహిళ ఐఎస్‌కు అప్పగించే అవకాశం తెలుస్తున్నది. ఈ పోస్టులో 2010 బ్యాచ్ అధికారుల్లోని నలుగురిలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు బల్డియా విస్తరణ దృష్ట్యా 2005 బ్యాచ్ లేదా 2009 బ్యాచ్ వారికి బాధ్యత అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. పవర్ సెక్టార్ విద్యుత్ శాఖ బాధ్యతలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా కలిగిన అధికారికి అప్పగించే అవకాశం ఉంటుంది. గతంలో అదే హోదా కలిగిన సీనియర్ అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నారు. మరొకరు ట్రాన్స్ కో, జెన్ కోడీ సీఎంగా పనిచేశారు. కాగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో కూడా పనితీరు ప్రామాణికంగా స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి.