ప్రస్తుతం టాలీవుడ్‌లో, తెలంగాణలో పెద్ద రగడగా మారింది కొండా సురేఖ, అక్కినేని నాగార్జున వివాదం. రాజకీయ లబ్ది కోసం కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగానే తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున అక్టోబర్ 8న నాగార్జున, అమల, నాగచైతన్య, సుప్రియ, వెంకటేశ్వర్లు కోర్టుకు అభ్యంతరం తెలిపారు. మొదటి సాక్షిగా సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది కోర్టు. ఈ కేసును 10కి వాయిదా వేశారు. 10న రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తారు. కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టంతోపాటు ఆమెపై క్రిమినల్ డిఫర్మేషన్ కేసు కూడా నాగార్జున వేశారు. బిఎన్‌ఎస్ సెక్షన్ 356 కింద పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి మాట్లాడుతూ 'ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సబ్‌మిట్ చేశాం. కొండా సురేఖగారు మాట్లాడిన వీడియోను కూడా సమర్పించాం. 10న జరిగే విచారణలో క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని కోర్టు భావిస్తే ఆమెకు ఫస్ట్ నోటీస్ జారీ చేస్తారు. నా క్లయింట్ పరువు, ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పకుండా క్రిమినల్ చర్యలకు దారి తీస్తాయి' అన్నారు.