- ముగిసిన నిమిషాంబదేవి అష్టాదశ బ్రహ్మోత్సవాలు
బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: అష్టాదశ బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజున శ్రీ నిమిషాంబదేవి మరోమారు రజత కవచంపైన స్వర్ణతాపడం చీరతో స్వర్ణకవచాలంకృత అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. నిమిషములో కోరిన కోర్కెలు తీర్చు కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన నిమిషాంబ అమ్మవారికి బ్రహ్మోత్సవాల చివరి రోజున పంచామృతాలతో పాటు, 56 రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో ఘనంగా అభిషేక కార్యక్రమం జరిగింది. వేలాది మంది భక్తులు స్వయంగా వీక్షించేలా, భారీ ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి నిజాభిషేకాన్ని కనులారా వీక్షించేలా ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసింది. బ్రహ్మోత్సవాల చివరి రోజున మంగళవారం తెల్లవారు జామునుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ పరిసరాలు నిమిషాంబ నామ స్మరణతో మార్మోగాయి. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో కొలువైవున్న శివుడు, సీతారామ లక్ష్మణులు, హనుమాన్, సాయిబాబా, దత్తాత్రేయ స్వాముల మూల విగ్రహాలకు కూడా నిజాభిషేకాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజాదికాలు ఘనంగా జరిగాయి. వేలాదిగా హాజరైన భక్తులకు ఏవిధమైన వారు కలుగకుండా దర్శనం కల్పించడంలో ధర్మకర్తల మండలి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. ఆలయ చైర్మన్ కెమెరాౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె.అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్.రమేష్, పాలకమండలి సభ్యులు కొరిచెర్ల శ్రీనివాస్ రావు, డి.నర్సింగ్ రావు, ఎం.శ్రీనివాస్ రావు, ఎం.సాయి బాబా (శ్యామ్), డి.సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్.శ్రీకాంత్, ఎన్.రామకృష్ణ, బి.హేమచందర్, వై.చంద్రశేఖర్ భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు. సాయంత్రం అమ్మవారిని వేలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య అమ్మవారిని ఊరేగింపు చేశారు.