- రేవంత్ సర్కార్ కు ప్రజలు గుణపాఠం చెబుతారు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఓవైసీలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా నిర్వహించడం లేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఒవైసీలకు భయపడలేదని, ఇప్పుడు అదే బాటలో రేవంత్ సర్కార్ వెళ్తుందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సమైక్యత దినోత్సవంగా నిర్వహించిందని, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా దినోత్సవం అని అంటోందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆదివారం బీజేపీను సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కో పేరుతో తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను విస్మరిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూ అవకాశం లేదని, రాజకార్ల అరాచక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన అమరుల త్యాగాలను గౌరవించి, ప్రజా దినోత్సవం పేరుతో కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవం గా నిర్వహించాలని ఆయన సూచించారు. లేకుంటే తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్ కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈసారి కూడా రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక లో కలిసిన జిల్లాలో విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏంఐఏం కూ భయపడి, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆయన చెప్పారు.