- భారీ బందోబస్తుతో రంగంలో హైడ్రా
- ఇప్పటికే 12వేల అక్రమ నిర్మాణాల గుర్తింపు
- 55కి.మీల మేర అభివృద్ధికి ప్రణాళికలు
- మలక్ పేట నియోజకవర్గం పిల్లి గుడిసెల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిర్వాసితుల తరలింపు
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి పొన్నం
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముందడుగు పడింది. చెత్త చెదారం, మురుగు నీటికి కేరాఫ్‌గా పేరున్న మూసీనది ప్రక్షాళన, సుందరీకరణకు రేవంత్ సర్కార్ ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. మూసీ చుట్టూ సుమారు 12 వేల ఆక్రమణలున్నట్లు ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం, మొత్తం 55కి.మీ మేర నదిని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా, పారిశ్రామికంగా, ఉపాధి అవకాశాలు పెంచేలా రూ. 1.50 లక్షల కోట్ల నిధులతో చేపడుతోన్న సుందరీకరణ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా తొలి దశలో మూసీ పరివాహక ప్రాంతాలను ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నది గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నది. అయితే వీటిని తొలగించే బాద్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. మూసీ ప్రక్షాళనలో ఇళ్లు కోల్పోయిన పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత, స్వచ్ఛ వాతావరణం కోసం తరలిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వారి కోసం మలక్ పేట అసెంబ్లీ సెగ్మెంట్లోని పిల్లి గుడిసెల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ నేటి నుంచి ఆయా ఇళ్లకు చేర్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మలక్ పేటలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఇళ్లను మూసీ పరివాహక ప్రజలకు కేటాయించారు. అనంతరం చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని పరిశీలించారు. భవనం అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా వసతి సౌకర్యాలు కల్పించలేదని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇదీలావుంటే.. డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శిస్తున్న సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కి చేదు అనుభవం ఎదురైంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాణి స్థానికులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు తమ ఆవేదన వ్యక్తం చేశారు.తమకు ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి అయితే పొన్నం.. వారిని సంతృప్తిపరిచే సమాధానం, స్పష్టమైన హామీ ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వెంట రోడ్ డెవలప్మెంట్ మంత్రి చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిశోర్, జీహెచ్‌సీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్నారు. ఇదిలావుంటే.. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు వ్యయం రూ.50,000 కోట్లుగా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత రూ.70,కోట్లకు సవరించింది. అయితే ముసాయిదా ప్రణాళికలు సిద్ధం కాకముందే అంచనాలను రూ.1.5లక్షల కోట్లకు సవరించిన విషయం తెలిసిందే. పరిశీలన సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మూసీ ప్రక్షాళన, సుందరీకరణ సాధ్యమైనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.