ముద్ర,తెలంగాణ:- అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్నామని ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలు, బంధువులతో కలిసి అయోధ్యకు వెళ్లిన ఆ దంపతులకు కడుపుకోతే మిగిలింది. ఓ కుమార్తె సరయూ నదిలో గల్లంతవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే…?
జనగామ పట్టణంలోని గీతానగర్కు చెందిన నాగరాజు, ఆయన భార్య, పెద్ద కుమార్తె తేజశ్రీ(17), చిన్న కుమార్తె తరుణి, మరో 8 మంది బంధుమిత్రులతో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ నుంచి విమానంలో అయోధ్య వెళ్లారు. 29న ఉదయం 9 గంటలకు సరయూ నదిలో స్నానాలు చేయడానికి లక్ష్మణ్ఘాట్ వద్దకు చేరుకుని.. పెద్ద కుమార్తెతో పాటు మరో ఐదుగురు స్నానం చేసేందుకు నీళ్లలో దిగారు. అయితే నేపాల్లోని రిజర్వాయర్ నుంచి వరద నీరు వదలడంతో అకస్మాత్తుగా ప్రవాహం పెరిగి ఐదుగురు ప్రవాహంలోకి జారిపోయారు. అక్కడే ఉన్న రెస్క్యూ టీం గజ ఈతగాళ్లు నలుగురిని రక్షించగా.. తేజశ్రీ గల్లంతయ్యారు. గల్లంతైన తేజశ్రీ జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.