Home సినిమా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీ రివ్యూ – Prajapalana News

'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీ రివ్యూ – Prajapalana News

by Prajapalana
0 comments
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీ రివ్యూ


నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు, అజయ్, జాన్ విజయ్, సత్య, సుదర్శన్ తదితరులు
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
సంగీతం: కార్తీక్‌ (పాటలు), సన్నీ.ఎం.ఆర్‌ (నేపథ్య సంగీతం)
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాత: బీవీఎస్ ఎన్ ప్రసాద్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌ (ఎస్‌.వి.సి.సి.ప్రొడక్షన్స్‌)
విడుదల తేదీ: నవంబర్ 8, 2024

'స్వామిరారా', 'కేశవ' తర్వాత హీరో నిఖిల్, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన మూవీ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. సైలెంట్ గా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏవో కారణాల వల్ల ఆలస్యంగా విడుదలకు నోచుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా అన్నట్టుగా మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రివ్యూ)

కథ:
రిషి(నిఖిల్) రేసర్. హైదరాబాద్ లో ఉండగా తార(రుక్మిణి వసంత్)ను ప్రేమిస్తాడు. కానీ ప్రేమ ఫలించదు. ఆ తర్వాత పెద్ద రేసర్ కావాలనే లక్ష్యంతో ఫ్రెండ్ యాజీ(హర్ష)తో కలిసి లండన్ కి వెళ్తాడు. అక్కడ తులసి(దివ్యాంశ) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా ముహూర్తం సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. అసలు తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్ళింది? రిషి తెలుసుకున్న విషయాలేంటి? మరోవైపు హైదరాబాద్ లో ఉన్నప్పుడు రిషి ప్రేమించిన తార, లండన్ కి ఎందుకు వచ్చింది? వీళ్ళ కథలోకి లండన్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ బధ్రీనాథ్ (జాన్ విజయ్) ఎలా వచ్చాడు? అతను రిషిని కిడ్నాప్ చేయడానికి కారణమేంటి? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
'స్వామిరారా'తో దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా.. సుధీర్ వర్మ సినిమా అంటే కొత్త పాయింట్, ఎంతో కొంత విషయం ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. అలాంటి సుధీర్ వర్మ ఏ కొత్తదనం ఉందని 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' కథను ఎంచుకోవాడో అర్థంకాని విషయం. నిఖిల్-సుధీర్ వర్మ కాంబోలో, లండన్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా అన్నట్టుగా.. మొక్కుబడిగా స్క్రిప్ట్ రాసుకొని ఈ సినిమా చేసినట్టుగా ఉంది. సుధీర్ సినిమాల్లో క్రైమ్ కామన్ గా ఉంటుంది. ఇందులో కూడా క్రైమ్ స్టోరీని, లవ్ స్టోరీని మిక్స్ చేశారు. అయితే అటు క్రైమ్ స్టోరీ కానీ, ఇటు లవ్ స్టోరీ కానీ ఏది ఆకట్టుకోదు. అటు నిఖిల్ సినిమాలు కానీ, ఇటు సుధీర్ సినిమాలను కానీ చూస్తే.. వారి ఫ్లాప్ సినిమాల్లో కూడా కొన్ని మెప్పించే అంశాలు ఉంటాయి. కానీ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' విషయంలో అలాంటిది జరగలేదు. కథాకథనాల్లో మెరుపుల్లేవు. పేరుకి చాలా ట్విస్ట్ లు ఉంటాయి కానీ, అవి ఆడియన్స్ ని థ్రిల్ చేయవు. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా వావ్ అనుకునేలా లేదు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కథను గందరగోళం చేశారు తప్ప, ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఎప్పుడో మొదలుపెట్టిన ఈ సినిమాని అప్పుడప్పుడు షూట్ చేసుకుంటూ ఇప్పటికి తీసుకొచ్చారేమో. సినిమా అటుకుల బొంతలా ఉంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రిషి పాత్రలో బలం లేకపోవడంతో నిఖిల్ నటన తేలిపోయింది. పెద్దగా చేయడానికి కూడా ఏం లేకుండా పోయింది. రీ షూట్ లేదా ప్యాచ్ వర్క్ కారణమేమో.. కొన్ని చోట్ల లుక్స్ కంటిన్యుటీ కూడా మిస్ అయింది. రుక్మిణి వసంత్ లుక్స్ పరంగా ఆకట్టుకుంది. ఉన్నంతలో దివ్యాంశ కౌశిక్ కి అంత నటన చూపించుకునే పాత్ర లభించింది. కామెడీ విలన్ తరహా పాత్రలో నటించిన జాన్ విజయ్, అజయ్, హర్ష చెముడు కొంత నవ్వించే ప్రయత్నం చేశారు. సత్య, సుదర్శన్ లవి ఫ్లాష్ బ్యాక్ చెప్పే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తరహా పాత్రలే.

రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కార్తీక్ పాటలు ఓకే. వీక్ సీన్స్ కి తగ్గట్టుగానే సన్నీ.ఎం.ఆర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఎడిటర్ నవీన్ నూలి కూడా ఈ సినిమాతో గట్టెక్కించే అవకాశం లేకుండా పోయింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే…
ఎప్పుడు తీశారో తెలియని ఈ సినిమా.. అప్పుడు వచ్చినా, ఇప్పుడు వచ్చినా రిజల్ట్ మాత్రం మారే ఛాన్స్ లేదు. ఇది నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా అయితే కాదు.

రేటింగ్: 1.5/5


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech