19 నుంచి విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

Published: Wednesday March 03, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ 6వ ఫేస్ లో కొలువుదీరిన విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ  చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను కమిటీ అధ్యక్షుడు రామస్వామి, ప్రధాన కార్యదర్శి కే.ఎస్.వి. రామారావులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  మాట్లాడుతూ ఆరవ ఫేస్ లో నివసించే తామంతా కలిసి ఆలయాన్ని నిర్మించుకున్నామని అన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈనెల 19న విఘ్నేశ్వర పూజతో వేడుకలు ప్రారంభం అవుతాయని తెలిపారు. వేడుకల్లో భాగంగా మహిళలచే సామూహిక లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, మహా పూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి.విష్ణువర్ధన్ రెడ్డి, వాసు, సిహెచ్.సోమేశ్, ఎం.సురేష్, సుధాకర్ బాబు, పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.