వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి ?

Published: Friday January 14, 2022
వికారాబాద్ బ్యూరో 13 జనవరి ప్రజాపాలన : మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. ఈసారి గురువారం (జనవరి 13) ఏకాదశి వచ్చింది. ఆ రోజంతా ఉంటుంది. అశ్వనీ నక్షత్రమని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలే సమస్త కోర్కెలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహా విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ రోజు ఏం చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున ప్రతిఒక్కరూ  బ్రాహ్మి ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తిచేసుకోవాలి. భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహా విష్ణువును ఆరాధిస్తారో.. ఉత్తరద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీ మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఏకాదశి అంతరార్థం ఏమిటంటే.. ఏకాదశి అనగా 11. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం, శ్రీ  అనంత పద్మనాభ స్వామి దేవాలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, డాక్టర్ సబితా ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి దంపతులు భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.