నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం

Published: Saturday June J, 2016

విజయవాడ, జూన్‌ 2 : సమైక్యాంధ్రప్రదేశ్‌ విభజన జరిగి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాల్లో తొలిరోజు నియోజకవర్గాల వారీగా ఉదయం 11 గంటలకు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అందులో భాగంగా విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని అక్కడకు హాజరైన ప్రజలతో, ఉద్యోగులతో, విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. '' అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాం... స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులమైన మనం ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకుందాం...దేశ భక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమ శిక్ష ణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనమంతా భుజం భుజం కలిపి పనిచేద్దాం... 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం... అవినీతి లేని, ఆర్ధిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం.... ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం....ఆంధ్రప్రదేశ్‌ నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం'' అని చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక సీడిని ఆవిష్కరించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.