తిరుమల దర్శన ఫలం

Published: Friday May J, 2016

కలియుగ దేవుని సన్నిదానం కడు రమణీయం : ముందు వరాహస్వామి దర్శనం ఆతరువాతే వెంకటేశ్వరుని దర్శనం.

కలియుగ తిరువేంకటనగరి నాధునిగా కలియుగంలో భక్తులకు కొంగుబంగారమైన దివ్యారామం తిరుమలలో నిత్యం కల్యాణంగా గోవిందుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సప్తాచల నిలయంలోని ఏడో కొండైన వెంకటాచలంలో దివ్యారామంవుంది. పురాణాలు, శాస్త్రాలు, స్థలమహత్యాలు, ఆళ్వార్‌ల ప్రబంధాల్లో తిరుమల గురించి సవివరంగా వివరించారు. తిరునగరి దర్శన భాగ్యం గురించి రుగ్వేదంలోను అష్టాదశపురాణాల్లోను ప్రస్తావనవుంది. శ్రీనివాసుడు తిరుమలను తన ఆవాసంగా మలచుకుని భక్తజనవరదుడిగా మారి ఐదువేల సంవత్సరాలయింది. అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని శ్రీవేంకటేశుడు వరాహస్వామి దగ్గర బహుమతిగా తీసుకున్నాడు. అందుకు ప్రతిగా తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకువచ్చేలా చూస్తానని ఓ హామీ ఇచ్చాడు. ఆ మేరకు వరాహస్వామికి ఓ ఒప్పందపత్రం సైతం రాసిచ్చాడు శ్రీనివాసుడు. ఈ ఒప్పందం రాసిన తామ్రపత్రం శ్రీనివాసుని మూలవిరాట్టు దగ్గర ఇప్పటికీ ఉందట. బ్రాహ్మీలిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెప్పేది అందుకేనన్నమాట.