గెలిచిన టీం ఆనందాన్ని పొందితే ఓడిన టీం అనుభవాన్ని పొందుతుంది

Published: Friday February 12, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11 ( ప్రజాపాలన ): క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కెసిఆర్ కప్ వాలీబాల్ పోటీలను జాగృతి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తుదిపోరును ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..క్రీడల్లో గెలుపోటములను సానుకూల దృక్పథంగా తీసుకోవాలని సూచించారు. గెలిచిన టీం ఆనందాన్ని పొందితే ఓడిన టీం అనుభవాన్ని పొందుతుందని వివరించారు. కప్ గెలవడం కంటే క్రీడల్లో పాల్గొనడం గొప్ప విషయమని గుర్తు చేశారు. నేటి యువత ఆటస్థలాల్లో కంటే సెల్ ఫోన్ లో క్రీడలు ఎక్కువగా ఆడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆటస్థలాల్లో ఆడితే చురుకుదనం, నాయకత్వ లక్షణం, సమైక్య స్ఫూర్తిదాయక నిర్ణయాలు, నిర్దేశిత సమయం వంటి విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన సిఎం కేసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహెష్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు ఏవైనా వాటిని ప్రోత్సహించేందుకు సదా ముందుంటాను అన్నారు. ఇప్పటికీ పరిగిలో జరుగుతున్న క్రీడలను దగ్గరుండి జరిపిస్తున్నానని పేర్కొన్నారు. వాలీబాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు జైదుపల్లి హన్మంతు రెడ్డి మాట్లాడుతూ.. మన దేశం జనాభాలో రెండవ స్థానం క్రీడల్లో చివరి స్థానమని దెప్పి పొడిచారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులను గుర్తించాలని సూచించారు. ఆణి ముత్యాల్లాంటి క్రీడాకారులు లభిస్తారని చెప్పారు. వాలీబాల్ పోటీలలో పాల్గొనేందుకు 42 జట్లు పోటీ పడ్డాయని వివరించారు. తుదిపోరుకు వికారాబాద్, శివారెడ్డి జట్లు అర్హత సాధించాయని పేర్కొన్నారు. తుదిపోరులో మూడు సెట్ల గేములలో వికారాబాద్ జట్టు రెండు సెట్లను గెలిచి ప్రథమ బహుమతి కింద 20 వేల రూపాయల నగదు పారితోషికంతో పాటు కప్ ను కైవసం చేసుకుందని చెప్పారు. శివారెడ్డి పేట్ జట్టు ద్వితీయ బహుమతితో పాటు 10 రూపాయలు నగదు పారితోషికంతో పాటు రన్నరప్ కప్ ను సొంతం చేసుకుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే వాలీబాల్ పోటీలలో నెగ్గి కప్పు సాధిస్తే 50 రూపాయలు నగదు పారితోషికం ఇస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. అనంతరం బహుమతి కార్యక్రమంలో భాగంగా బెస్ట్ అటాకర్ బహుమతిగా వికారాబాద్ జట్టు సభ్యుడు రాము, బెస్ట్ సెటర్ గా మహేష్ లు పొందారు. బెస్ట్ ఆల్ రౌండర్ గా శివారెడ్డి పేట్ జట్టు సభ్యుడు అజ్మత్ కు, బెస్ట్ లిబెరో బహుమతిగా బాల్ రాజ్ లు పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాగృతి అధ్యక్షురాలు పెద్ది పుణ్యవతి అంజన్న, జాగృతి నాయకుడు కుమ్మరి శ్రీనివాస్, పిఈటిలు, టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.