జన్‌ధన్ ఖాతాలు ఇపుడు ఆర్థిక నేరగాళ్ళకు అడ్డా

Published: Friday May J, 2016
దేశంలో సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తేవాలన్న బృహత్ సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకం జన్‌ధన్ స్కీమ్. అతి తక్కువ కాలంలో పది కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగింది. ఇది ఓ రికార్డుగా మారింది. అయితే, ఈ జన్‌ధన్ ఖాతాలు ఇపుడు ఆర్థిక నేరగాళ్ళకు అడ్డాగా మారింది. ఇదే విషయంపై భారత రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా స్పందిస్తూ జన్‌ధన్‌ ఖాతాలు ఆర్థిక నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు కేంద్రం కానున్నాయని, ఇలాంటి ఖాతాలను ఆర్థిక నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందువల్ల వాటిపై నిరంతరం పర్యవేక్షించే ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకుల్లో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల ద్వారా ఖాతాదారుకు తెలియకుండానే భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు ఇటీవల బయటకు వచ్చిన కేసును ఆయన ఉదహరించారు. అది పంజాబ్‌లోని ఒక రోజుకూలీ ఖాతా అని, బేసిక్‌ ఖాతాగా ప్రారంభించిన దానిలో లావాదేవీలపై కూడా పరిమితి ఉన్నప్పటికీ కోటి రూపాయల లావాదేవీ జరిగిందని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ కూలీకి నోటీసు పంపగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. బ్యాంకు ఖాతా ప్రారంభించే సమయంలో కెవైసి నిబంధనలు తుచ తప్పకుండా పాటించినా తదుపరి నిఘాలో మాత్రం బ్యాంకులు విఫలమయ్యాయనేందుకు ఇది సంకేతమన్నారు. బ్యాంకుల అంతర్గత నిఘా వ్యవస్థ కాలం చెల్లిపోయింది కావడం వల్ల ఇలాంటి దుర్వినియోగాన్ని గుర్తు పట్టలేకపోయిందని వ్యాఖ్యానించారు.