ప్రమాదాల నివారణ కొరకు కట్టుదిట్టమైన చర్యలు జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

Published: Thursday September 29, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 28, ప్రజాపాలన  :
 
జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ కొరకు సంబంధిత శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా రహదారి ప్రమాదాల నివారణ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు రవాణా శాఖ ద్వారా జీ.ఓ.ఎం.ఎన్. నం.20 ప్రకారం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు జిల్లాలో భద్రతా నియమాలు పాటించేలా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమ, నిబంధనలు పాటించాలని, వాహనానికి సంబంధించిన లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, భీమా, పొల్యూషన్ ఇతరత్రా అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు, వైద్య ఆరోగ్య, రవాణా, రోడ్డు-భవనాలు, జాతీయ రహదారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతినిధులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.