- కీలకంగా తటస్థుల ఓట్లు!
- (డి.సోమసుందర్)
న్యూయార్క్, అక్టోబర్ 24: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో పదిరోజుల సమయం మాత్రమే మిగిలివుంది. అధ్యక్ష స్థానానికి ఎవరిని ఎన్నుకోవాలో ఇంకా తేల్చుకోలేక అమెరికా సమాజం తీవ్ర సందిగ్ధంలో పడింది. స్వాతంత్ర్యం వచ్చిన 248 ఏళ్ల తర్వాత కూడా ఒక మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడానికి అమెరికన్ సమాజపు విజ్ఞత ఇంకా తడబాటు పడుతోంది. పరిపాలన చేయడంలో ఒక మహిళ కంటే పురుషుడే సమర్థుడనే ధోరణిలో అమెరికా మీడియాలో చర్చ జరగడం దిగ్భ్రాంతి కలిగించక మానదు.
“కొత్త అధ్యాయం తెరుద్దాం , కొత్త దారిలో ముందడుగు వేద్దాం” అంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఇస్తున్న నినాదం జాతీయస్థాయిలో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని , ఊపును తెచ్చిన దాఖలా కనిపించడం లేదు. అమెరికన్ చరిత్రలో తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు వీలుగా పార్టీలకు అతీతంగా ఒక విస్తృత ప్రజా కూటమిని సృష్టించడంలో డెమొక్రటిక్ పార్టీ వ్యూహకర్తలు విజయం సాధించలేక పోయారు.
అలాగని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేస్తున్న “అమెరికన్ స్వర్ణ యుగం” నినాదం కూడా విస్తృత ప్రజామోదాన్ని పొందుతున్న ఆనవాళ్ళేమీ కనిపించడం లేదు.మర్యాదా హద్దులను అతిక్రమించి, ఒక్కోసారి అసభ్యతను కూడా జోడించి స్వసంకీర్తనం చేసుకుంటూ దూషణ ప్రసంగాలు సాగిస్తున్న డోనాల్డ్ ట్రంప్ ను కట్టడి చేయడానికి రిపబ్లికన్ పార్టీలోని విద్యాధికులు ముందుకు రాకపోవడం కూడా విస్మయాన్ని కలిగిస్తున్నది. అమెరికన్ రాజకీయ చర్చలో ప్రస్తుతం కనిపిస్తున్న అనిశ్చితి, సందిగ్ధత , రాజకీయ ప్రతిష్టంభన ఎన్నికల తర్వాత కూడా కొనసాగ వచ్చునని పలువురు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సాంస్కృతిక , సామాజిక ఆర్థిక ,రాజకీయ బహుళత్వం , వైవిధ్యం , విస్తారంగా ఉన్న అమెరికన్ సమాజపు సమస్యలను అర్థం చేసుకోవడంలో, వాటికి తగిన పరిష్కారాలను రూపొందించడంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు విఫలం అవుతున్నాయని ఎన్నికల సందర్భంగా జరుగుతున్న బహిరంగ చర్చ తేటతెల్లం చేసింది.అభ్యర్థుల ఉధృత ప్రచారం మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందస్తు పోలింగు ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తం నమోదైన ఇరవై నాలుగున్నర కోట్ల ఓట్లలో అక్టోబర్ 22 వ తేదీ నాటికే సుమారు రెండుకోట్ల ఓట్లు పోలయ్యాయి.ముందస్తు పోలింగులో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 4.35 కోట్లకు చేరింది. దాదాపు 35 రాష్ట్రాల్లో ముందస్తు పోలింగు ప్రారంభం కాగా, రానున్న వారంలో మరో 12 రాష్ట్రాలలో ముందస్తు పోలింగు జరగనున్నది. దాంతో ముందస్తు పోలింగు శాతం మరింతగా పెరుగుతుందని అంచనా.
ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ అత్యంత హోరాహోరీగా నువ్వా నేనా అనే స్థాయికి మారింది. తాజా సర్వేల్లో ఇద్దరి మధ్య వ్యత్యాసం ఒకటి లేదా రెండు శాతపు పాయింట్లకు మించడం లేదు. తమ గణాంకాలలో మూడు శాతం అటూ ఇటూ మారవచ్చుననే షరతును అన్ని సర్వే సంస్థలూ ప్రకటిస్తున్నాయి.దీనినిబట్టి అంతిమ విజేత ఎవరో తుది పోలింగు తర్వాతే తేలుతుందని న్యూయార్క్ టైమ్స్ , సి.ఎన్.ఎన్. , వాల్ స్ట్రీట్ జర్నల్ , బీబీసీ , అల్ జజీరా , ఫోర్బ్స్ , వంటి సంస్థలు అంటున్నాయి. ఎవరికీ ఆధిక్యత రాని పక్షంలో ఏం జరుగుతుందనే అంశంపై కూడా కొందరు చర్చ ప్రారంభించారు.
దేశంలో వెలువడుతున్న వందలాది సర్వేల సగటును బట్టి ఇప్పటికీ కమలా హారిస్ 1.9 శాతం ఆధిక్యతతో ఉన్నట్లు ప్రాజెక్ట్ 538 డాట్ కామ్ సంస్థ చెప్పింది. అయితే గత ముప్పై రోజులుగా ఆమె వైపు కనిపించిన మొగ్గులో ఒకటి , రెండు శాతపు పాయింట్లు తగ్గుముఖం పట్టినట్లు, ఆమేరకు డోనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు పెరిగినట్లు ఆ సంస్థ పేర్కొన్నది.అయితే దాదాపు ఐదు శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించు కోలేదని సర్వేలన్నీ వెల్లడించాయి.ప్రచారం ఆఖరు వారాల్లో ఐదు శాతం తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడం అభ్యర్థుల ముందు ఒక సవాలుగా మారింది.
జాతీయస్థాయి పాపులర్ ఓటులో అక్టోబర్ 22 నాటికి డోనాల్డ్ ట్రంప్ కంటే కమలా హారిస్ 1.9 శాతం ఆధిక్యతలో ఉన్నారు. అలాగే రాష్ట్రాల వారీగా చూస్తే 19 రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకునే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 224 కాగా, 21 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ గెలుచుకునే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 218 ఉండవచ్చునని ప్రాజెక్టు 538 డాట్ కామ్ సంస్థ అంచనా వేసింది. అధ్యక్ష స్థానం గెలవాలంటే కనీసం 270 ఓట్లు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. పోల్ సర్వేల అంచనాలు అనేకసార్లు ఘోరంగా తప్పినప్పటికీ , వాటి ఆధారంగా ప్రచార వ్యూహాలను రూపొందించుకోవడం మినహా రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు వేరే గత్యంతరం లేదు.
ఎన్నికల్లో మొదటి నుండి అనిశ్చిత ఫలితాలకు పేరుపడ్డ పెన్సిల్వేనియా, జార్జియా, అరిజోనా, నెవాడా , మిషిగాన్ , నార్త్ కరోలినా , విస్కాన్సిన్ రాష్ట్రాలలో మొత్తం తొంభైమూడు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి.వాటిని దక్కించుకోవడానికి గత పదిరోజులుగా అభ్యర్థులు ఇద్దరూ ఈ రాష్ట్రాలలో కేంద్రీకరించి చావో రేవో తేల్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. గత వారమంతా అనిశ్చిత రాష్ట్రాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ , కార్యక్రమాల్లో పాల్గొంటూనే కమలా హారిస్ పలు చానెళ్లకు , రేడియో పాడ్ కాస్టర్లకు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. నల్లజాతి పురుషుల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను ప్రకటించారు.
ఫాక్స్ న్యూస్ గతవారంలో నిర్వహించిన సర్వేలో యాభై రెండు శాతం ఓటర్లు ట్రంప్ కు మద్దతు ఇవ్వగా కమలా హారిస్ కు 48 శాతం మద్దతు ఇచ్చారు.డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు వ్యతిరేకంగా అవాస్తవాలను వండి వార్చడంలో ఫాక్స్ న్యూస్ చానల్ బాగా పేరు పొందింది. చానల్ రాజకీయ వ్యాఖ్యాత బ్రెట్ బేయర్ నిర్వహించిన కమలా హారిస్ తో ఇంటర్వ్యూ ” ట్రంప్ – హారిస్ రాజకీయ చర్చ” మాదిరిగా ఉందని , దాన్ని జర్నలిజంగా పిలవడమే అవమానం అంటూ తోటి ఛానళ్ళ యాంకర్లు ఆయన్ను దుమ్మెత్తి పోశారు.
“ట్రంప్ ను సమర్థిస్తున్న యాభై శాతం అమెరికన్లు తెలివి తక్కువ వారని మీరు భావిస్తున్నారా?” అంటూ బ్రెట్ బేయర్ అడిగిన ప్రశ్నకు “అమెరికన్ ప్రజల విజ్ఞతను నేను ఎన్నడూ శంకించను, నాకు వారిపై పూర్తి విశ్వాసం ఉంది” అన్నారు కమలా హారిస్.కమలా హారిస్ విశ్వాసం బాగానే ఉంది. కానీ ప్రస్తుతం అమెరికన్ ఓటర్ల విజ్ఞత సందేహాల మధ్య, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నది. తమ జాతీయ ఆదర్శాల గురించి, ఘనతల గురించి అమితంగా గర్వించే అమెరికన్లు తమ దేశంలోని జీవిత వాస్తవికతలను జీర్ణించుకోలేక పోతున్నారు.
“అమెరికాను తిరిగి గొప్ప దేశంగా మారుద్దాం” అనే డోనాల్డ్ ట్రంప్ నినాదానికి , “కొత్త అధ్యాయాన్ని తెరుద్దాం – కొత్త దారిలో ముందడుగు వేద్దాం” అంటూ కమలా హారిస్ ఇస్తున్న నినాదానికి మధ్య ఎటూ తేల్చుకోలేక అమెరికన్ సమాజం నిట్ట నిలువునా రెండుగా చీలిపోయి కనిపిస్తున్నది. ప్రస్తుతం 36 ట్రిలియన్ డాలర్ల అప్పులతో , 2.4 ద్రవ్యోల్బణంతో , 4.2 శాతం నిరుద్యోగంతో , పెరిగిన ధరలతో, విద్య, వైద్యం , గృహ నిర్మాణం , రవాణా , ఇంధనం , బీమా ఖరీదై పోయిన తరుణంలో అమెరికన్లు సతమతం అవుతున్నారు.
సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన ప్రధాన రాజకీయ పార్టీలు ఆ విషయంలో విజయవంతం కాలేక పోతున్నాయి. కోవిడ్ అనంతరం ధ్వంసం అయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక తొలుత ట్రంప్ , ఆ తర్వాత జో బైడెన్ ప్రభుత్వాలు చతికిల పడ్డాయి.ట్రంప్ నిర్వాకం కారణంగానే దేశం ఇబ్బందుల్లో ఉందని డెమొక్రాట్లు చెబుతున్నారు. గత మూడున్నరేళ్లుగా అధికారంలో ఉండి డెమొక్రాట్లు ఏమీ చేయలేక పోయారని, బైడెన్ అసమర్ధుడని, తాను అధికారంలో ఉండి ఉంటే దేశం పరిస్థితి మెరుగ్గా ఉండేదని, తనను ఎన్నుకుంటే అమెరికాకు “స్వర్ణయుగం” వస్తుందని ట్రంప్ అంటున్నారు.
అమెరికన్ సమాజం ఇప్పటికే ట్రంప్ పరిపాలనను ఒకసారి చవి చూసింది. ఆయన చిత్ర విచిత్రమైన మాటలు వినీ వినీ ముఖం మొత్తిన తర్వాతనే జో బైడెన్ కు అధికారం కట్ట బెట్టింది. తమ ప్రస్తుత సమస్యలకు జో బైడెన్ పాలనా వైఫల్యాలే కారణమని కూడా అమెరికన్లలో అత్యధికులు భావిస్తున్నారు.జో బైడెన్ అధికారంలో పాలు పంచుకున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాను మెరుగైన అధ్యక్షురాలిగా పని చేస్తానని గట్టిగా చెప్పుకోలేక పోయారు. బైడెన్ పాలనా వైఫల్యాల భారాన్ని వదిలించుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు.నిజానికి ఆమెకు అంత సమయం కూడా చిక్కలేదు. జో బైడెన్ కంటే భిన్నంగా ఉంటానని చెప్పడానికి ఎన్నికల రంగంలోకి దిగిన తొంభై రోజుల తర్వాత గానీ ఆమెకు నోరు రాలేదు. తానే సమర్ధుడైన అధ్యక్షునిగా పనిచేస్తానని ట్రంప్ ఇస్తున్న హామీ ఎవరికీ విశ్వాసం కలిగించక పోయినా అమెరికన్ల ముందు మరో ప్రత్యామ్నాయం లేదు.
“నేను అధికారంలోకి వస్తే ప్రజలకు భారీగా పన్నులు తగ్గిస్తాను, పన్నులు లేని సమాజమే నా లక్ష్యం, విదేశీ కంపెనీలపై టారిఫ్ లు పెంచుతాను” అని , ట్రంప్ అంటున్నారు. ” “నాకు టారిఫ్ లు అంటే చాలా ఇష్టం, డిక్షనరీ లో నాకు బాగా ఇష్టమైన పదం టారిఫ్” అంటూ ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.ట్రంప్ ప్రతిపాదించే పన్నుల కోత, ఆర్థిక పథకాలు రానున్న పదేళ్ళలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై మరో 15 ట్రిలియన్ల ఆర్థికభారాన్ని మోపుతుందని బ్లూమ్ బెర్గ్ న్యూస్ ప్రధాన సంపాదకుడు జాన్ మిక్లత్ వైట్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ తో అన్నారు.దానికి సమాధానంగా ” నేను లెక్కల్లో ఎప్పుడూ ప్రథమస్థానంలో ఉన్నాను , నా లెక్కలు నాకున్నాయి ,అసలు నీ జీవితంలో నువ్వెప్పుడూ సరిగ్గా ఆలోచించవు” అంటూ ట్రంప్ ఆయన్ను దుమ్మెత్తి పోశారు.అయితే అమెరికాపై అప్పుల భారం పెరుగుతుందనే విషయాన్ని మాత్రం ఆర్థికవేత్తలు అందరూ ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.
వాదనల్లో వైరుధ్యాలు!
విదేశాంగ విధానం విషయంలో ఇరువురి వాదనలను అమెరికన్లు ఎలా స్వీకరిస్తారనేది ఒకింత ఆసక్తికరం.తమకు అంతర్జాతీయ స్థాయిలో ఆధిపత్యం ఉండటాన్ని అమెరికన్లు గొప్పగా భావిస్తారు. దాన్ని కొనసాగించే సమర్ధుడైన అధ్యక్షుడు కావాలని కోరుకుంటారు, కానీ అమెరికా యుద్ధ వ్యయం పెరగడం వల్ల తమకు పెనుభారం పడుతుందని , అలాంటి భారాలు తగ్గించే అధ్యక్షుడు కావాలని కూడా వారు భావిస్తారు. దీన్ని ట్రంప్ సమర్ధంగా వాడుకున్నారు.”సమర్ధుడైన అధ్యక్షుడు ఉంటే యుద్దాలు ఉండవు, ప్రపంచాన్ని శాసిస్తాం , చైనాను ,రష్యాను కట్టడి చేస్తాం, నాటో ను అదుపులో ఉంచుతాం” అంటారు ట్రంప్.
“నాటో కు అంత డబ్బు ఖర్చు చేయడం దండగ, వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకోకపోతే మనం వాళ్లకు అండగా ఉండటం అనవసరం, ఆ విషయం నేను స్పష్టంగా వాళ్లకి చెబుతాను” అని కూడా అంటారు ట్రంప్. “అంతర్జాతీయంగా మన ఆధిక్యాన్ని నిలుపుకోవాలి,అందుకు మనం మన చిరకాల మిత్రులను , కూటములను విశ్వాసంలోకి తీసుకోవాలి , అంతర్జాతీయంగా మన ఒప్పందాలకు , అంగీకారాలకు కట్టుబడి ఉండాలి” అంటారు కమలా హారిస్.ఆర్థిక వ్యవహారాల్లో పన్నులు లేని ఆర్థికవ్యవస్థ గురించి ట్రంప్ మాట్లాడుతుంటారు.
“టారిఫ్ ల ద్వారా దేశానికి ఆదాయం వస్తుంది , అవసరం అయితే పది ఇరవై కాదు , 50 శాతం టారిఫ్ లు విధిస్తాను, అదే చైనా అయితే 60 శాతం టారిఫ్ విధిస్థాను” అని ట్రంప్ అన్నారు. “టారిఫ్ ఎక్కువ అనుకునే విదేశీ కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి చేయవచ్చు, అలాంటి వారికి పన్ను రాయితీలు ఉంటాయి, అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయి” అంటారు ట్రంప్.
“అణ్వాయుధాలు , క్లీన్ ఎనర్జీ , అంతరిక్ష పరిశోధనలు ఫెడరల్ బడ్జెట్ పై ఎక్కువ భారం వేస్తాయి, వాటి పేరుతో కంపెనీలు దోచుకుంటాయి,మనం ప్రైవేటు రంగానికి అలాంటివి కొన్ని వదిలేద్దాం ” అంటారు ట్రంప్.”సంపద సృష్టించి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం” అంటారాయన.
కమలా హారిస్ ఆర్థిక విధానాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.”మిలియన్ డాలర్లు మించి ఆదాయం ఉన్నవారిపై ప్రస్తుతం ఉన్న 20 శాతం పన్నును 28 శాతం చేస్తాం , కార్పొరేట్ పన్నును , సంపద పన్నును 35 శాతానికి పెంచుతాం, ఆ విధంగా వచ్చిన ఆదాయాన్ని పేద , మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం , బిలియనీర్ల అనుకూల విధానాలను మార్చి , శ్రమజీవుల , కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తాం” అంటారు కమలా హారిస్.అక్రమ వలసదారుల విషయంలో కూడా ఇరు పక్షాల వాదనలు భిన్నంగా ఉన్నాయి.
“దేశంలో ఒక కోటి పది లక్షల మంది అక్రమ వలసదారుల ఉన్నారు, వారిని సామూహికంగా బైటికి పంపిస్తాను, ఆరోజు ఒక రక్తపాత దినంగా మారుతుంది, నిజంగా రక్తపాతం , అయినా వెనుకంజ వేయను, సరిహద్దుల భద్రత పటిష్టం చేస్తాను,” అంటారు ట్రంప్. “వలస వచ్చిన వారివల్లే దేశంలో నేరాలు , హింస పెరిగిపోతున్నాయి, వాళ్ళు మన పిల్లల్ని చంపుతున్నారు, వాళ్ళు మన పెంపుడు జంతువులను తింటున్నారు, వాళ్ళ వల్ల మన ఉద్యోగాలు పోతున్నాయి” అంటారు ట్రంప్.”కమలా హారిస్ వస్తే మీ పన్నుల సొమ్ముతో వలస వచ్చిన వారికి సంక్షేమం చేస్తుంది” అంటారాయన.
కమలా హారిస్ వాదన వేరుగా ఉంది.
“అక్రమంగా వలస వచ్చిన వారిని చట్టబద్ధంగా బైటికి పంపిస్తాం. వలస చట్టాలను కఠినతరం చేస్తాం , సరిహద్దులో భద్రతా దళాల సంఖ్యను పెంచుతాం , చట్టబద్ధంగా వచ్చినవారు మనకు అనేక సేవలు చేస్తున్నారు, మనం చేయలేని పనులు వారు చేస్తున్నారు, వారు మనలో ఒక భాగం , మన సంపద సృష్టిలో వారు పాలు పంచుకుంటున్నారు” అంటూ కమలా హారిస్ అంటారు. “కాలిఫోర్నియా అటార్నీగా ఉన్నకాలంలో వలస దారులను కఠినంగా అడ్డుకున్నాను” అంటూ కమల తన పాత రికార్డును గుర్తు చేస్తుంటారు.
శ్వేత జాతి దురహంకార వ్యాఖ్యలకు పేరు పొందిన ట్రంప్ ఇప్పుడు నల్లజాతి వారి ప్రేమికునిగా మాట్లాడుతున్నారు.”నేను నల్ల మగవాళ్ళను ప్రేమిస్తాను , నేను నిజంగా ప్రేమిస్తాను, మీరు తెలుసుకోండి, నేను వస్తేనే మీకు ఉపయోగం, ఆమె వస్తే నల్ల జాతి ఉద్యోగాలను అక్రమ వలస దారులకు కట్టబెడుతుంది, గత మూడున్నరేళ్లలో వాళ్ళు ఏం చేసారు, మీ జీవితాలను ధ్వంసం చేశారు ” అంటారు ట్రంప్ . ఈ విషయంలో కమలా హారిస్ స్పందన వేరేగా ఉంది. “నల్ల జాతి పురుషులకు ఉద్దేశించిన ఒక ప్రత్యేక ఆర్థిక పథకాన్ని” కమలా హారిస్ ప్రకటించారు.”అందరికీ అవకాశాలు ఇచ్చే ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం”అని కమలా హారిస్ అంటారు.
అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు నల్లజాతి పురుషులకు ప్రత్యేక పథకాలు ప్రకటించడం విమర్శలకు తావు ఇచ్చింది. తమ పరిపాలనలో నల్లజాతి వారికి ఏమీ చేయలేదని డెమొక్రాట్లు అంగీకరించినట్లు అయ్యింది.మహిళల గర్భస్రావపు హక్కులు , పిల్లల సంరక్షణ , ఆరోగ్యం వంటి విషయాల్లో కమలా హారిస్ కు నలుపు తెలుపు తేడా లేకుండా మహిళల్లో పెద్ద ఎత్తున మద్దతు , అత్యధిక సానుకూలత ఉన్నది.అయితే గర్భస్రావపు హక్కుల విషయంలో నల్లజాతి పురుషుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. నల్లజాతి జనాభా తగ్గకుండా ఉండాలంటే తమ స్త్రీలు ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సి ఉంటుందని, ఈ విషయంలో స్త్రీలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వడం మంచిది కాదని, దీనిపై కుటుంబమే నిర్ణయం తీసుకోవాలని నల్లజాతి పురుషులు భావిస్తున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది.
నోరు పారేసుకుంటున్న ట్రంప్!
తన ప్రచారంలో భాగంగా ట్రంప్ దూకుడుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రత్యర్థిపై వీలయినంత అసభ్య పదజాలంతో విరుచుకు పడుతుంటారు. తాను ఎన్నికయ్యాక తన వ్యతిరేకుల సంగతి తేలుస్తానని హెచ్చరిస్తూ ఉంటారు. అసత్యాలను, అవాస్తవాలను ఆయన అలవోకగా వల్లె వేస్తుంటారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని పలు నిజ నిర్ధారణ సంస్థలు ప్రతిరోజూ ఆధారాలతో సహా ప్రకటించడం ఒక పనిగా పెట్టుకున్నాయి. అయినా ట్రంప్ ప్రచార శైలిలో ఏమీ మార్పు లేదు.2020 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అప్పట్లో తన గెలుపుని దొంగిలించారని ట్రంప్ ఎక్కువగా ఆరోపిస్తూ ఉంటారు. ఎన్నికల ఫలితాలపై ఆయన వేసిన కేసులన్నిటినీ కోర్టులు కొట్టేసాయి.అయినప్పటికీ ఆయన తన వాదనను మొండిగా కొనసాగిస్తూనే ఉన్నారు.
ఎన్నికల అక్రమాలకు సహకరించిన న్యాయమూర్తుల సంగతి తేలుస్తానని , వారందర్నీ జైల్లో పెడతానని బెదిరించే వరకూ ట్రంప్ తెగించారు.తాను అధ్యక్షునిగా ఎన్నికైన వెంటనే 2021 జనవరి 6 న కేపిటోల్ పై దాడికి పాల్పడి, పోలీసులను చంపిన కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని జైలు నుండి విడుదల చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు.తనపై ఉన్న కేసుల గురించి కూడా ఆయన అదే ధోరణిలో మాట్లాడుతున్నారు.ఆర్థిక అక్రమాలు లైంగిక నేరాలు, రికార్డుల అపహరణ , ఫోర్జరీ, శాంతియుత అధికార మార్పిడికి అడ్డు పడటం , వంటి అనేకానేక అభియోగాలు ఆయనపై ఉన్నాయి.వాటిపై కోర్టుల్లో వివిధ స్థాయిల్లో విచారణ కొనసాగుతున్నది.
“గత నాలుగేళ్లుగా నాకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థను ఒక ఆయుధంగా మార్చారు, నేను అధికారంలోకి రాగానే జో బైడన్, కమలా హారిస్, న్యాయమూర్తులు, అటార్నీలు , సహా అధికారులు అందర్నీ జైల్లో పెడతాను” అని ట్రంప్ పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తన రాజకీయ ప్రత్యర్ధులను ఉద్దేశించి ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని సృష్టించాయి.
“మన దేశంలో కొందరు చెడ్డ వాళ్ళున్నారు, వాళ్ళు రోగగ్రస్తులు, వాళ్ళు మానసిక ఉన్మాదులు , వాళ్ళలో లిబరల్స్ , రాడికల్ లెఫ్ట్ , మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు , ఫాసిస్టులు ఉన్నారు, మనకు బైట శత్రువులు ఉన్నారు, చైనా ,రష్యా , వాటి సంగతి మనకు తెలుసు , బైటి వాళ్ళ సంగతి ఎలాగూ చూస్తాం, అది ఎప్పుడైనా చేయవచ్చు, కానీ లోపలి శత్రువులు ఉన్నారు, వారు మరింత ప్రమాదం , ముందు వారి సంగతి చూడాలి, అవసరం అయితే వారిని అణచివేయడానికి సైనిక దళాలను వినియోగిస్తాను ” అన్నారు ట్రంప్.
ఏదో ఒకసారి యాదృచ్చికంగా నోరు జారి అన్నమాటలు కావివి. చాలా సందర్భాల్లో ఇవే తరహా మాటలు ఆయన అంటూ వచ్చారు.ఈ మధ్య ఒక సభలో మాట్లాడుతూ “నేను మీ గొంతుకగా ఉంటానని 2016 లో చెప్పాను, దానికి తోడు ఇప్పుడు నేను మీ ఆయుధంగా ఉంటాను, నేను మీ యుద్ధ వీరునిగా ఉంటాను, నేను మీ ప్రతీకారంగా ఉంటాను, నేను మీ న్యాయంగా ఉంటాను” అన్నారు ట్రంప్.రిపబ్లికన్లలో ఒకవర్గం ట్రంప్ మాటల ధోరణిని వ్యతిరేకిస్తున్నది. కానీ తన ప్రచార సభల్లో పాల్గొనే ఒక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఆధోరణిలో మాట్లాడతారని ఎక్కువ మంది అభిప్రాయ పడతారు.
“ఎన్నికల కోసం ఆయన అలా అంటారు కానీ , ఎన్నికల తర్వాత ఆయన అవన్నీ మరిచిపోతారు, , గతంలో ఆయన ప్రవర్తన చూస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది” అని ఎక్కువ మంది రిపబ్లికన్లు అంటారు.కమలా హారిస్ ప్రచార బృందం తొలి రోజుల్లో ట్రంప్ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ట్రంప్ కు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని కమలా హారిస్ ప్రచార వ్యూహకర్తలు భావించారు.అయితే ట్రంప్ మద్దతు కూడా గణనీయంగా ఉందని గ్రహించాకనే కమలా హారిస్ ఆయన ధోరణులపై, వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పలువురు అత్యంత సీనియర్ సైనిక , భద్రతా దళాల అధికారులు , ఆర్థిక వేత్తలు , ప్రచార వ్యూహకర్తలు , మాజీ గవర్నర్లు , సెనెటర్లు , పార్టీ నుండి బైటికి వచ్చి ట్రంప్ పై విమర్శలు చేస్తున్నారు.ట్రంప్ ఫాసిస్టు అని , ఆయన అన్న మాటలను తేలిగ్గా తీసుకోవద్దని, ఆయనకు పగ , ప్రతీకారాలు ఎక్కువనీ , అన్నంత పనీ చేస్తారని వారు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం వీరి వ్యాఖ్యలను కమలా హారిస్ ప్రచార వ్యూహకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పెడుతున్నారు.
ప్రచారంలో ట్రంప్ దూకుడుగా చెలరేగి పోతూ ఉంటే దానికి ప్రతి క్రియాత్మకం గా మాత్రమే ఇన్నాళ్లూ కమలా హారిస్ ప్రచార బృందం స్పందిస్తూ వచ్చింది. గత పది రోజులుగా ట్రంప్ పై విమర్శల దాడిని కమలా హారిస్ శిబిరం బాగా పెంచింది.రెండు పార్టీలలో చిరకాలంగా తిష్ట వేసుకుని కూచున్న పీఠాధిపతులు దేశంలో వస్తున్న జనాభా మార్పులను తమ సంప్రదాయ సిద్ధాంతాల ధోరణులతో మాత్రమే చూస్తారంటూ కొందరు వ్యాఖ్యాతలు ఇటీవల విమర్శ చేయడం విశేషం.
దేశంలోని నలుపూ- తెలుపూ , పేద – ధనిక, విద్యాధిక – చదువు తక్కువ, ఆడా – మగ, ఆఫ్రో , ఆసియన్, లాటినో , హిస్పానిక్ , అరబ్ – యూదు ప్రజల ఆకాంక్షలను సంప్రదాయ భావజాల చట్రాల పరిధిలోనే చూడ్డానికి పీఠాధిపతులు అలవాటు పడ్డారు, మారుతున్న జన బాహుళ్యాల సంస్కృతులను , సామాజిక ఆర్థిక రాజకీయ సామాజిక ఆకాంక్షలను కొత్తగా చూడ్డంలో వారు విఫలం అవుతున్నారు” అనీ పలువురు అధ్యయన వేత్తలు గత కొంతకాలంగా వాదిస్తున్నారు.ఆ కారణంగానే రిపబ్లికన్లు , డెమొక్రాట్లు భావజాల పరమైన పోరాటాన్ని రోజువారీ రాజకీయ ప్రచార వ్యూహంగా కుదిస్తున్నారని వారు అంటున్నారు.
అమెరికన్ చరిత్రలో తొలిసారిగా అధ్యక్షునిగా ఒక నల్లజాతి వ్యక్తి బరాక్ ఒబామా ఎన్నికైనప్పుడు అమెరికా సమాజంలో వచ్చిన ఒక వెల్లువ తర్వాతి ఎన్నికల్లో కన్పించలేదు.2016 ఎన్నికల్లో క్లింటన్లపై తీవ్ర వ్యతిరేకత తోనే ట్రంప్ ను ఎన్నుకున్నారు. 2020 లో ట్రంప్ పై వ్యతిరేకత తోనే జో బైడెన్ ను అమెరికన్లు ఎంచుకున్నారు.
“ఇద్దరు అభ్యర్థుల మీదా వ్యతిరేకత ఉన్నా ఉన్నంతలో తక్కువ చెడ్డ మనిషిని ఎన్నుకోవడం తప్ప అమెరికా ముందు వేరే ప్రత్యామ్నాయం లేదు” అంటూ న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ ఒకరు ఇటీవల రాశారు. కమలా హారిస్ గెలుస్తారని గానీ, ట్రంప్ పని అయిపోయిందని గానీ లేదా అందుకు విరుద్ధంగా జరుగుతుందని గానీ ఎవరూ చెప్పలేని అనిశ్చిత పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.
నవంబరు ఐదవ తేదీన జరిగే ఎన్నికల్లో ఎవరో ఒకరు అధ్యక్ష స్థానానికి ఎన్నిక కావచ్చు. పోల్ సర్వేలు నిజం కావచ్చు , కాక పోవచ్చు.కానీ అమెరికన్ సమాజంలో కొనసాగుతున్న భావజాల ప్రతిష్టంభన , రాజకీయ అనిశ్చితి మాత్రం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.