Sliderజాతీయ- అంతర్జాతీయ

బిజెపియేతర పార్టీలతో పవార్‌ చర్చలు!

దిల్లీ: ఏడు దశల పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు అధికార ఎన్డీయేకే అనుకూలంగా రావడంతో ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు నాయకులు ఇతర నాయకులతో వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా యూపీఏలోని సీనియర్‌ నాయకుడు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మూడు పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన.. ఇప్పటివరకు ఇరు కూటములకు దగ్గరకాని తెలంగాణ రాష్ట్ర సమితి, వైసీపీ, ఒడిశాలో బిజు జనతా దళ్‌ నాయకులతో చర్చలకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే జగన్‌మోహన్‌ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన అందుబాటులోకి రాలేదని ఓ ఎన్సీపీ నాయకుడు తెలిపినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది.

ఈ క్రమంలో శరద్‌ పవార్‌ కేసీఆర్‌తో చర్చించినట్లు ఎన్సీపీ నాయకులు తెలిపారు. కేంద్రంలో హంగ్‌ ఏర్పిడిన పక్షంలో యూపీఏకు మద్దతిచ్చే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే దీనిపై స్పందించిన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌.. కేసీఆర్‌, పవార్‌ భేటీ వార్తల్ని కొట్టిపారేశారు. మరోవైపు బీజేడీ నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ కూడా ఫలితాలు యూపీఏకి అనుకూలంగా వచ్చిన పక్షంలో కచ్చితంగా మద్దతిస్తామని హామీ ఇచ్చినట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించడానికి పట్నాయక్‌ కార్యాలయం నిరాకరించడం గమనార్హం. ‘‘పవార్‌ ఎన్డీయేతర పక్షాలతో గత కొన్ని రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారు. షెడ్యూల్‌ వెలువడక ముందు నుంచే అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఆయన వివిధ పార్టీల నాయకులతో చర్చిస్తున్నారు. ప్రస్తుతానికి అందరం ఎన్నికల ఫలితాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని ఎన్సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ మజీద్‌ మేమన్‌ తెలిపారు. అయితే పవార్‌ ఎవరెవరిని సంప్రదించారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఫలితాల అనంతరం ఏర్పాటయ్యే యూపీఏ కూటమిలో శరద్‌ పవార్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఆయన అనేక పార్టీల నేతలతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్నారు.

Comment here